రాష్ట్ర‌ప‌తి ఇఫ్తార్ విందుకు మోడీ డుమ్మా

గత యేడాది మాదిరిగానే ఈసారి కూడా రంజాన్‌ సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్‌ విందుకు మోడీ మొగం చాటేస్తున్నారు. మోడికి ముస్లింల పట్ల ఉన్న అభిప్రాయానికి ఈ చర్య అద్దం పడుతోంది. మోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ ముస్లిం అందించిన టోపీని పెట్టుకోవడానికి నిరాకరించి వార్తల్లోకి ఎక్కారు. ఇప్పడు ప్రధాని అయ్యాక కూడా మోడీ తన ముస్లిం వ్యతిరేకతను దాచుకోవడం లేదు. ప్రధాన మంత్రులు రంజాన్‌ మాసం సందర్భంగా ఇఫ్తార్‌ విందులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. వాజ్‌పేయి కూడా ఇఫ్తార్‌ విందులు ఇచ్చేవారు. కాని మోడీ మాత్రం ప్రధానిగా అధికారం చేపట్టాక గత ఏడాది గాని, ఈ ఏడాది గాని ఇఫ్తార్‌ విందుల జోలికి పోలేదు. పైగా రాష్ట్ర‌పతిభ‌వ‌న్‌లో బుధ‌వారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు ప్ర‌ధాని మోడీ  హాజ‌రుకావ‌డం లేద‌ని పీఎంఓం కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మ‌రో ముఖ్య‌మైన ప‌ని ఉండ‌డం వ‌ల‌నే రాష్ట్ర‌ప‌తి ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్ర‌ధాని మోడి హాజరు కావడం లేదని పీఎంఓ వివ‌ర‌ణ ఇచ్చింది. ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మోడీ ఇఫ్తార్ విందు ఇవ్వ‌లేదు. ఇటీవ‌లే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ప‌లువురు రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆహ్వానించారు. అయితే ప్ర‌ధాని మోడీ మాత్రం ఈ సంప్ర‌దాయానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.