తొక్కిసలాటకు కారణాలు ఇవేనా?

రాజమండ్రి పుష్కర ఘాట్లో మంగళవారంనాడు తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏమిటనే దానిపై అనేక విషయాలు బయటకొస్తున్నాయి.

 • చంద్రబాబు స్నానం చెయ్యాల్సిన వి.ఐ.పి. ఘాట్‌ (సరస్వతి ఘాట్‌)లో కాకుండా సామాన్య భక్తులకోసం కేటాయించిన పుష్కర ఘాట్‌కు రావడం. ఆయన రావడానికి చాలాసేపటి ముందు నుంచే భక్తుల్ని పుణ్యస్నానాలకు రానివ్వకుండా అడ్డుకోవడం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు సుమారు 2,3 గంటల పాటు పుష్కర స్నానాలు, పూజలు చేయడం. అప్పటిదాకా సామాన్య భక్తుల్ని పుణ్య స్నానాలకు అనుమతించకుండా గేట్లు మూసేసి నిలిపివేయడంతో వేల సంఖ్యలో భక్తులు గేట్ల అవతల నిలబడిపోవడం, కూర్చోవడానికి కూడా స్థలం లేకపోవడం, తాగడానికి మంచినీళ్ళు కూడా లేకపోవడం, తిరిగి వెనక్కి వెళ్ళిపోదామంటే వీలు లేకుండా జనం కిక్కిరిసిపోవడం వలన జనం ఊపిరాడక అల్లాడిపోయారు. ముసలి వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతే, పసిపిల్లలు హృదయ విదారకంగా ఏడ్చారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఘాట్‌ నుంచి బయటకు వెళ్ళిపోయాక ఘాట్‌ గేట్‌ ఒక్కటి మాత్రమే తీయడంతో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగి భారీ ప్రాణ నష్టం జరిగింది.
 • పుష్కర ఏర్పాట్లకు ఇప్పటికే 1300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామంటున్నారు. కాని ఏర్పాట్లు దారుణం. స్నానాలకోసం నదిలోకి వెళ్ళడానికి దారి కల్పించారు కాని తిరిగి రావడానికి దారి కల్పించలేదు. తొక్కిసలాటకి ఇది కూడా ఒక కారణం.
 • బాధితులను తక్షణం ఆదుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమయింది.
 • బ్రతికి ఉన్నారో, చనిపోయారో కూడా చూడకుండా, మృతదేహాల పట్ల కూడా గౌరవం లేకుండా వైద్య సిబ్బందికి బదులు పోలీసులే స్ట్రెచర్‌ల మీద ఒకళ్ళమీద ఒకళ్ళని పడేసి తీసుకుపోవడం దారుణంగా అనిపించింది.
 • మంగళవారం ఉదయం 6:26 గంటలకు బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తాడని… అప్పుడే పుష్కరాలు మొదలవుతాయని ఆ సమయంలో స్నానం చేస్తే అధిక పుణ్యం లభిస్తుందని ప్రచార సాధనాల్లో కొంతమంది పండిత బ్రహ్మలు ఊదరగొట్టడం వల్ల మొదటిరోజు ఆ సమయానికే పుణ్యస్నానం చెయ్యాలని చాలా మంది ఎగబడ్డారు. ప్రభుత్వ ప్రచారం కూడ ఇందుకు తోడ్పడింది.
 • భక్తజనంలాగే ముఖ్యమంత్రికూడా ప్రజల ముందు తొలిస్నానం తానే చేసి పుష్కరాలను ప్రారంభించాలన్న పట్టదలతో పుష్కర ఘాట్‌కు రావడం, గంటల తరబడి భక్తులను నిలిపివేయడంతో తొక్కిసలాటకు దారితీసింది.
 • చంద్రబాబు వి.ఐ.పి. ఘాట్‌ను వదిలి సామాన్యజనానికి ఉద్దేశించిన పుష్కర ఘాట్‌కి రావడానికి కొన్ని వెబ్‌సైట్లలో వేరే కథనాలు వినిపిస్తున్నాయి.
 • చంద్రబాబు పుష్కరస్నానం చేసి పూజలు చేస్తుండగా కొన్ని వేల మంది భక్తులు అక్కడ ఎదురు చూడడాన్ని ఒక షార్ట్‌ ఫిలిమ్‌గా చిత్రీకరించారని, పుష్కరాల తర్వాత కుంభమేళాను తలదన్నే రీతిలో పుష్కరాలను నిర్వహించామని, లక్షల సంఖ్యలో జనం వచ్చారని చూపించడానికి వీలుగా గేట్లు మూసి జనం రద్దీ కనిపించేలా చేశారని కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీన్ని డైరెక్ట్‌ చేసిన దర్శకుడి పేరు కూడా సోషల్‌ మీడియాలో మార్మోగిపోయింది.
 • ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్‌ పర్యటనకు పోవడానికి ముందే పుష్కర ఏర్పాట్లు చూసి మండిపడ్డారని, పనులు ఎప్పుడు పూర్తి అవుతాయని కేకలు వేశారని వార్తలొచ్చాయి. విచిత్రం ఏమిటంటే పుష్కర పనులను పర్యవేక్షించాల్సిన పరకాల ప్రభాకర్‌ను, మంత్రి నారాయణను, యనమల రామకృష్ణుడిని తనవెంట జపాన్‌ తీసుకుపోవడం వల్లే ఇక్కడ అతీగతీ లేకుండా పోయిందని, పుష్కర ఏర్పాట్లు ఏవీ సక్రమంగా జరగలేదని, వాళ్ళను తీసుకు వెళ్ళకుండా ఉంటే కొంతవరకైనా పనులు జరిగేవని అంటున్నారు.
 • ఎవరు చెయ్యాల్సిన పనుల్ని వారికి అప్పగించకుండా అన్నీ తన ఒక్కడి చేతుల మీదుగా జరిగాయనే ప్రచారంకోసం చంద్రబాబు  కక్కుర్తిపడడం వల్లే ఎవరి పనులు వారు చెయ్యలేక పోయారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
 • హుదూద్‌ తుఫాన్‌ అప్పుడు కూడా విశాఖ జిల్లా కలెక్టర్‌ అదే కామెంట్‌ చేశాడు. ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటే ఫ్రోటోకాల్‌ ప్రకారం మేము, అధికార యంత్రాంగమంతా ఆయన వెంట ఉండాలి. ఇక మా విధుల్ని నిర్వహించే అవకాశం ఎక్కడ? అని.
 • అందుకే రఘువీరారెడ్డి అన్నారు… పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఈ పదకొండు రోజులు రాజమండ్రిలో ఉండకుండా రాజధానికి వెళ్ళిపోతే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని. జనం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. కుక్క చేసే పని కుక్క చెయ్యాలి, గాడిద చేసే పని గాడిద చెయ్యాలి. లేకపోతే కథలో జరిగినట్లు జరిగే అవకాశం ఉంది.