నిందితుల జాబితాలో వేం న‌రేంద‌ర్ రెడ్డి ?

ఓటుకు నోటు కేసు విచార‌ణ వేగ‌వంత‌మ‌వుతోంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి వేం న‌రేందర్ రెడ్డిని ఏసీబీ నిందితుడిగా చేర్చే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వేం న‌రేంద‌ర్ కుమారుడు క్రిష్ణ కీర్త‌న్‌ను గురువారం విచారించిన పోలీసుల‌కు ప‌లు కొత్త విష‌యాలు తెలిసిన‌ట్లు స‌మాచారం. క్రిష్ణ కీర్త‌న్ పాత్ర‌పై ముందే ఏసీబీ వ‌ద్ద ప‌క్కా స‌మాచారం ఉంది. విచార‌ణ‌లో అత‌ని నోటితోనే నిజం చెప్పించాల‌ని చూసిన ఏసీబీకి మొద‌ట పెద్ద‌గా ఫ‌లితం రాలేదు. దీంతో ఉద‌య‌సింహా, సెబాస్టియ‌న్‌లను ఎదురుగా కూర్చుండ‌బెట్టి ప్ర‌శ్నించ‌డంతో క్రిష్ణ కీర్త‌న్ పొంత‌న‌లేని స‌మాధానాలు చెప్పిన‌ట్లు స‌మాచారం. ఏడుగంట‌ల సుదీర్ఘ విచార‌ణ‌లో ఆర్థిక మూలాల‌కు సంబంధించిన కీల‌క స‌మాచారం ఏసీబీ రాబ‌ట్ట‌గ‌లిగింది. అందుకే మ‌రోసారి వేం న‌రేంద‌ర్‌రెడ్డిని పిలిచి విచారించాల‌ని నిర్ణయించింది. అయితే, క్రిష్ణ‌కీర్త‌న్ చెప్పిన అంశాల ఆధారంగా  వేం న‌రేంద‌ర్ రెడ్డిని సాక్షిగా పిలిపించాలా? లేదా నిందితుడిగా నోటీసులు ఇవ్వాలా విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.