ప్రత్యూషకు వస్తున్న నిధులకు రెక్కలు!

ప్రత్యూష… ఇపుడు వార్తల్లోని యువతి. పెంపుడు తల్లి, కన్న తండ్రి హింసలతో భూలోక నరకాన్ని చూసిన ఆమె ఇపుడు కేసీఆర్‌ మానస పుత్రిక… పోసాని ప్రతిపాదిత దత్త పుత్రిక. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇపుడు ఆమె గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొలుకుంటున్న విఐపీ. ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఆమెకు ప్రాణ హాని ప్రమాదముందన్న బెదిరింపులతో ఓ పోలీసు పహరాతో ఆమెకు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి. ప్రత్యూషపై జరిగిన వేధింపులు చూసి జనం మనసు ధ్రవించి పోయింది. పొరుగువారు, పోలీసులే ఆమె కథను వెలుగులోకి తెచ్చారు. దీంతో ఆమె భౌతికంగా అనుభవించిన హింస చూసి అందరూ చలించిపోయారు. ఇలా హృదయం విచ్చిన్నమైపోయిన వారిలో ఒకరు గ్లోబల్‌ ఆస్పత్రి యాజమాన్యం. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చంతా తమ ఆస్పత్రి భరిస్తుందని మీడియా ముందు పెద్ద ఎత్తునే ప్రచారం చేశారు. ఇలా ఒక్క ఆస్పత్రి యాజమాన్యమే కాదు… ఇంకా ఎంతో మంది ఆమె కథ విని కరిగిపోయారు. కన్నీరు పెట్టారు. ఆమె కోలుకునేందుకు కావలసిన నిధులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి నిధులు అందజేశారు. ఈ నిధులన్నీ ప్రస్తుతం ఎక్కడున్నాయి? 
ప్రత్యూష వైద్యానికయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా బహిరంగంగానే ప్రకటన చేశారు. ఇక ఆవేశంగా ప్రకటనలు చేసే పోసాని ఆ అమ్మాయిని తానే దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష కోలుకోవడానికి ఆయన కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం ఈపాటికే చేసి ఉంటారన్న అభిప్రాయం కూడా ఉంది. అంటే ప్రత్యూష ఆస్పత్రి ఖర్చులను ఎవరు భరిస్తున్నారు? మీడియా ముందు ప్రకటనలు చేసిన గ్లోబల్‌ ఆస్పత్రా? కేసీఆర్‌ ప్రభుత్వమా? పోసాని కృష్ణ మురళీయా? లేక బహిరంగ ప్రకటనలు చేసిన దాతలా? ఈ పబ్లిసిటీ స్టంట్‌ చేసిన వారిలో నిజమైన దాతలెవరు? చికిత్స ఖర్చులు భరిస్తున్న కర్తలెవరు? ఆమె పేరుతో వచ్చే నిధులు, ఆమె చేతి ఖర్చులకు ఇచ్చిన డబ్బులు చివరకు ఏమవుతున్నాయి? ఆమెకు చేరతున్నాయా… లేదా?ఇవే ప్రశ్నలు బాలల హక్కుల సంఘానికి కూడా వచ్చాయి. ఆ ప్రతినిధులు ఓ ప్రకటన చేస్తూ ప్రత్యూషకు వచ్చిన నిధులు గ్లోబల్‌ ఆస్పత్రి వర్గాలు కాజేస్తున్నాయని ఆరోపించారు. ఆమెను వెంటనే నిమ్స్‌కు తరలించాలని డిమాండు చేశారు.అధికారికంగా ఆమెకు 1.75 లక్షల నిధులొస్తే అందులో 1.22 లక్షలు ఇప్పటివరకు ప్రత్యూష వైద్యానికి ఖర్చయిందని, ఇక 53 వేలు మాత్రమే బ్యాలెన్స్‌ ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చూపిస్తున్నాయని బాలల సంఘం ఆరోపిస్తోంది. ప్రత్యూష వైద్యం ఖర్చును మొత్తం తామే భరిస్తామని మీడియా ముందు ప్రకటనలు చేసి హైకోర్టు ప్రశంసలందుకున్న గ్లోబల్‌ ఆస్పత్రి ప్రచారం అంతా ఆర్బాటమేనా? బాలల హక్కుల సంఘం వచ్చిన నిధుల విషయాన్ని లేవనెత్తకపోతే వైద్యం ఖర్చుల కింద ఆ 1.22 లక్షలు వెళ్ళి పోయి ఉండేవా? గుళ్ళూ గోపురాలకు వచ్చే చందాలను అవకాశవాదులు కాజేసినట్టే ప్రత్యూషకు వచ్చే నిధులను కూడా కాజేయడానికి ఇలాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారన్నది జగమెరిగిన సత్యం. నిధులను తాము కాజేయమని ఆస్పత్రి వర్గాలు ప్రకటించినంత మాత్రాన నిజం నిజం కాకపోతుందా? అందుకే దాతల నుంచి అందిన సాయంపై ఆస్పత్రి వర్గాలు శ్వేతపత్రం విడుదల చేయాలని బాలల హక్కుల సంఘం చేస్తున్న డిమాండు సహేతుకమే.