కరెంట్ కోసం ఎమ్మెల్యేకు బంధనం

కరెంట్ కోసం కాళ్లరిగేలా తిరిగినా తమ గోడు ఎవరూ వినడం లేదని ఆగ్రహించిన రైతులు పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ఎమ్మెల్యేను, ఆయన కూడా వచ్చిన కౌన్సిలర్‌ను కట్టిపడేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. రంజాన్‌ను పురస్కరించుకొని ఈద్ శుభాకాంక్షలు చెప్పేందుకు బీఎస్పీ ఎమ్మెల్యే బబ్బన్‌సింగ్ చౌహాన్, స్థానిక కౌన్సిలర్‌ను గ్రామస్తులు తాళ్లతో కట్టేసి రెండు గంటలపాటు నిర్బంధించారు. ఎంతోకాలంగా తాము కరెంటు సమస్యను ఎదుర్కొంటున్నామని, దీనిపై ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో కరెంటు కొరత ఉందని, ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిలిచి పోతున్నదని ఎమ్మెల్యే కూడా అంగీకరించారు. తమ గ్రామంలో విద్యుత్, రోడ్లు, నీటి సమస్య పరిష్కారం రూ.80 లక్షలు మంజూరయ్యాయని అధికారులు చెప్పారని, కానీ ఇంతవరకు ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని ఓ గ్రామస్తుడు పేర్కొన్నారు.