వ్యభిచార కూపం నుంచి 39 మందికి విముక్తి

వ్యభిచార గృహం నుంచి తప్పించుకు వచ్చిన ఓ యువతి ఇచ్చిన సమాచారం ఎంతో మంది అభాగ్యుల పాలిట వరమైంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, బలార్షా వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న 39 మంది మహిళలకు కొత్త జీవితాన్నిచ్చింది. బలార్షాలోని ఓ వ్యభిచార గృహం నుంచి వచ్చిన యువతి హైదరాబాద్‌లోని పోలీసులకు తను పడిన వేధనను, అక్కడ వ్యభిచారకూపంలో మగ్గిపోతున్న అభాగ్యుల దీనగాథలను ఫిర్యాదు చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని తమను మహారాష్ట్రకు కొంతమంది మహిళలు తీసుకెళ్ళారని, అక్కడ తమను వ్యభిచార గృహాలకు అమ్మేశారని ఆ యువతి తెలిపింది. తమతో బలవంతంగా వ్యభిచారం చేయించారని, తప్పించుకునే దారిలేక కొంతకాలంగా భరించి అవకాశం దొరకడంతో పారిపోయి వచ్చేశానని, ఇంకా ఎంతోమంది అక్కడ మగ్గిపోతున్నారని ఆ యువతి వివరించింది. ఈ విషయాన్ని పోలీసులు సీఐడీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్ళారు. ఈనేపథ్యంలో 150 సభ్యులతో కూడిన సీఐడీ పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, బలార్షాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా ఈ కూపాల్లో మగ్గిపోతున్న 31 మంది మహిళలను, మరో ఎనిమిది మంది మైనర్‌ బాలికలను గుర్తించారు. వీరితోపాటు వ్యభిచార గృహాలు నడుపుతున్న 41 మంది ట్రాఫికర్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 18 మంది మహిళా ట్రాఫికర్స్‌ కూడా ఉన్నారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచారు. ఈ కూపం నుంచి బయటపడిన 39 మందిలో 22 మంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫికర్స్‌ను, బాధితులను కోర్టులో హాజరు పరిచారు.