మంత్ర 2 మూవీ రివ్యూ

రేటింగ్ 1/5
సినిమా పుట్టిన తొలి రోజుల్లో శోకం, శృంగారం, హాస్యం, రౌద్రం, వీరం, శాంతం అన్ని రసాలున్నాయి కాని బీభత్సం లేదు. మెల్లిగా ఇంగ్లీష్ లో హిచ్ కాక్ మొదలుపెట్టాడు, ఇక్కడ అనుకరణ‌ మొదలైంది. వందేళ్ళ తెలుగు సినిమా చరిత్రలో హారర్ సినిమాల‌ సంఖ్య తక్కువే. ఆదరణ కూడా తక్కువే. అయినా తీస్తూనే వుంటారు..
భయపడేదానికి సినిమాకి వెళ్ళే సెక్షన్ ఒకటుంటుంది. డబ్బులిచ్చి గుండెదడతో చూస్తూవుంటారు. అయితే కాలం మారే కొద్దీ ప్రేక్షకుడూ మారాడు. ఇప్పుడు వాడిని భయపెట్టాలంటే చాలా కష్టం. ప్రేక్షకుల్ని భయపెట్టాలని రాంగోపాలవర్మ చాలా సినిమాలు తీసి చివరికి తానే భయపడి మానుకున్నాడు..
హారర్ సినిమాలు రెండు రకాలు. దెయ్యాలున్నాయని భయపెట్టి, చివరికి అంతా వుత్తుత్తిదే అని తేల్చడం. నేరుగా దెయ్యాలే రంగంలోకి దిగి ప్రేక్షకుల అంతుతేల్చడం. రెండింటికి లాజిక్ వుండదు.ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మంత్ర 2 అని ఒక సినిమా. మన ముందు కొచ్చింది…కధేమిటంటే..
మంత్ర (ఛార్మి) కి దయ్యాల కలలొస్తుంటాయి. ఆమె భయపడుతూ మనల్ని భయపెట్టాడానికి ప్రయత్నిస్తూవుంటుంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయిన మంత్ర ఒక ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా వుంటుంది. ఆ ఇంట్లోని తనికెళ్ళ భరణి, ఢిల్లీ రాజేశ్వరి దంపతులకు ఈమెకి సంబంధమేమిటనేది సస్పెన్స్.
సెకండాఫ్ లో అంతా ఆ ఇంట్లో అందరూ భయపడుతూ వుండగా చివరికి ఒక కన్ క్లూజన్ తో ముగిస్తారు. హీరో ఒక పోలిస్ ఆఫీసర్. ఆమె మంత్రకి రక్షణగా వుంటాడు. చదువుతుంటేనే గందరగోళంగా వుందా ? సినిమా ఇంకా గందరగోళంగా వుంటుంది. ఫస్టాఫ్ టీవి సీరియల్ లా నడుస్తుంది. సెకండాఫ్ లో కొంచెం వేగముంది. అప్పటికే అలసిపోయిన ప్రేక్షకుడు తేరుకునేలోగా సినిమా అయిపోతుంది.
సినిమాలో ఒక పాటే వుంది. అదో రిలీఫ్. ఆ పాటలో హీరోయిన్ డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేస్తూ సెక్సీలుక్స్ ఇస్తుంది. దర్శకుడి అభిరుచికి ఇదో నిదర్శనం. హారర్ సినిమాలకి ఫోటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. ఈ రెండూ చాలా పూర్. ఛార్మీలో చార్మ్ పోయింది. ఆమె మెల్లిగా రిటైరైతే మంచిది.
ఇప్పటికే తెలుగు సినిమాలు రకరకాలుగా భయపెట్టి ప్రేక్షకుల్ని ధీయేటర్ వైపు రాకుండా చేస్తున్నాయి. మళ్ళీ అదనంగా హారర్ సినిమాలు తీయడ‌మెందుకు ? లాజిక్, మ్యాజిక్ రెండూ లేని మంత్ర 2 ని చూడాలనుకుంటే చూడండి. చూసింతరువాత ఇంటికి జాగ్రత్తగా  వెళ్ళండి. భయంలో దారి మరచిపోయేరు..!
‍ –జీఆర్ మహర్షి