మైండ్‌ బ్లోయింగ్‌: బాహు..అలీ

ఆల్‌టైం రికార్డు సృష్టించిన బాహుబలిలోని ఓ సీన్‌ ఇపుడు వీక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ సీన్‌ ఒరిజినల్‌ కాదు… హాస్యనటుడు అలీ, చిన్నితెర యాంకర్‌ సుమ మీద చిత్రీకరించింది. ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని పేరడీ వీడియోలు సృష్టించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు చాలామంది. అయితే గతంలో మాదిరిగా ఈసారి కూడా మాటీవీ సిని’మా’ అవార్డుల ప్రదానోత్సవం కోసం అలీ, సుమపై బాహుబలి సినిమాలో ధీవర అనే పాట పేరడీతో ఓ వీడియోను నిర్మించారు. అవార్డుల పంక్షన్‌లో స్టేజీ మీద ప్రదర్శితమైన ఈ వీడియో ఆహుతులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించింది. గతంలో వీరిద్దరిపైనే చిత్రీకరించిన మగధీర సినిమాలో పేరడీ సన్నివేశం, అలాగే సాగరసంగమంలో సన్నివేశం కడుపుబ్బ నవ్వించాయి. ఈసారి అలీ, సుమ జంటగా తీసిన ధీవర పాటలోని సన్నివేశం చూసిన వారందరూ సూపర్‌ సూపర్‌ అంటూ చప్పట్లు కొట్టారు. అసలు బాహుబలి చిత్రాన్ని దర్శకుడు రాజ్‌మౌళి మూడేళ్ళపాటు నిర్మిస్తే ఇదే సినిమాలోని ఓ సీన్‌ను సినీ హాస్యనటుడు అలీ, చిన్నితెర యాంకర్‌ సుమపై మూడు గంటలపాటు చిత్రీకరించి రికార్డు సృష్టించింది మాటీవీ బృందం. ఇంతకీ ఈసీన్‌కి పెట్టిన పేరేమిటో తెలుసా… బాహు..అలీ… అదేనండి బాహుబలి ఇంగ్లీషు అక్షరాల్లో రెండో b అక్షరాన్ని తొలగిస్తే వచ్చిందే… బాహు…అలి.!