తెలంగాణ సారా వ్య‌తిరేక ఐకాస ఆవిర్భావం

చీప్ లిక్క‌ర్ విషయంలో తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న‌ నిర్ణ‌యంపై వివిధ పార్టీల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించాల‌న్న పేరుతో ప్ర‌భుత్వమే రూ.15ల‌కు సారా సీసా అంద‌జేయాల‌న్న స‌ర్కారు నిర్ణ‌యంపై ఉద్య‌మించ‌డానికి కాంగ్రెస్ సిద్ధ‌మ‌వుతోంది. మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ నేతృత్వంలో తెలంగాణ సారా వ్య‌తిరేక ఐకాస ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ప్ర‌జ‌ల్ని సారా మ‌హ‌మ్మారి నుంచి కాపాడేందుకు అన్ని పార్టీల ఆధ్వ‌ర్యంలో ఉద్య‌మించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.  పేద‌ల బ‌తుకుల‌ను చిద్రం చేసే చీప్ లిక్క‌ర్‌ను ప్ర‌భుత్వ‌మే స‌ర‌ఫ‌రా చేయ‌డాన్ని త‌ప్ప‌బ‌ట్టారు. అందుకే  తెలంగాణ సారా వ్య‌తిరేక ఐకాస ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఐకాస ఆధ్వ‌ర్యంలో అన్ని గ్రామ‌స‌భ‌ల్లో నిర‌స‌న‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఐకాస అధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం అన్నిపార్టీ నాయ‌కుల‌తో క‌లిసి రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.