కృత్రిమ పండ్లపై హైకోర్టు సీరియస్‌

కృత్రిమంగా కాయలను పండ్లు చేయడం తీవ్రవాదం కన్నా పెద్ద నేరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించింది. సహజంగా పండాల్సిన వాటిని ముందుగా పండేట్టు చేయడానికి కృత్రిమ రసాయనాల వాడకం తీవ్రవాదం కన్నా బలమైన నేరమని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని ఆదేశించింది. కృత్రిమ పండ్లను తినడం వల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంది. అసలు సహజంగా పక్వానికి వచ్చే వాటి(పండ్లు)కి రసాయనాలు వాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కాయలను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ వాడకంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రసాయనాలు వాడే పండ్లు ఆరోగ్యానికి సురక్షితం కాదని చెబుతూ నిషేధిత రసాయనాల వాడకాన్ని నిరోధించలేరా అని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే చర్యలను ఉపేక్షించరాదన్న హైకోర్టు స్పష్టం చేసింది.