పాక్‌లోనే దావూద్ ఇబ్ర‌హీం!

మాఫియాడాన్‌, ముంబై వ‌రుస బాంబు పేలుళ్ల ప్ర‌ధాన నిందితుడు దావూద్ ఇబ్ర‌హీం పాక్‌లోనే ఉన్నాడ‌ని తేలిపోయింది. ఇంత‌కాలం దావూద్ త‌మ వ‌ద్ద లేడంటూ బుకాయిస్తున్న పాక్ అబ‌ద్దాల పుట్ట ప‌గిలిపోయింది. దావూద్ అత‌ని కుటుంబంతో కలిసి పాకిస్తాన్‌లోనే ఉన్నాడ‌ని శ‌నివారం సాయంత్రం కొన్ని ప్ర‌సార మాధ్య‌మాల్లో వెలువ‌డిన క‌థ‌నాలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. దావూద్ ఉంటున్న ఇళ్ల వివ‌రాల‌తోపాటు ఆయ‌న పిల్ల‌లు, వారి పెళ్లిళ్లు, కొంటున్న ఇళ్లు త‌దిత‌ర‌ తిరుగులేని ఆధారాల‌ను భార‌త నిఘా వ‌ర్గాలు సంపాదించాయి. అత‌ను ప్ర‌స్తుతం ఉంటున్న ఇళ్ల వివ‌రాలు, వాటి ఫోన్ నెంబ‌ర్లు కూడా వెల్ల‌డ‌య్యాయి. దీంతో భార‌త్ నుంచి విలేక‌రులు దావూద్ ఇంటికి ఫోన్ చేశారు. ఆ స‌మ‌యంలో అత‌ని భార్య ఫోన్ ఎత్తింది, దావూద్ నిద్ర‌పోతున్నాడ‌ని, మ‌రోసారి ఇంట్లో లేర‌ని స‌మాధానం చెప్పింది. 
త‌ర‌చుగా ఇల్లు మారుస్తున్న వైనం..!
దావూద్ ప్ర‌స్తుతం ఉంటున్న ఇల్లును 2013లో కొనుగోలు చేశాడు. భార‌త్‌, అమెరికా నిఘా సంస్థ‌ల నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఎక్క‌డా స్థిరంగా ఉండ‌టం లేదు. పాక్ ర‌క్ష‌ణ సంస్థ నీడ‌లో నిత్యం నివాసాల‌ను మారుస్తూ వ‌స్తున్నాడు. క‌రాచీలోని అబ్బుల్లా షా గాజీ ద‌ర్గా, ఖైబ‌ర్ తాంజీమ్ ఫేజ్‌-5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా, భౌభ‌న్ హిల్‌, సీపీ బ‌జార్ సొసైటీ, నూరియాబాద్‌.. ఇలా వేర్వేరు చోట్ల దావూద్ మ‌కాం మారుస్తూనే ఉన్నాడు.  వీటిని పాకిస్తాన్ ముందు ఉంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. వీటి ఆధారంగా దావూద్ త‌మ‌కు అప్ప‌గించాల‌ని భార‌త్ డిమాండ్ చేయ‌నుంది. ఈ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా పాకిస్తాన్ ద్వంద వైఖ‌రిని ప్ర‌పంచ‌దేశాల ఎదుట ఎత్తిచూపింది భార‌త్‌. ఐక్య‌రాజ్య‌సమితి, అమెరికా వంటి దేశాలు దావూద్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించాయి. అత‌న్ని ప‌ట్టించిన‌వారికి త‌గిన పారితోషికం కూడా ఇస్తామ‌ని కూడా చెబుతున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విష‌యంలో ఇంకా బుకాయిస్తూనే ఉంది. కానీ, ప్ర‌స్తుతం భార‌త నిఘావ‌ర్గాలు తిరుగులేని ఆధారాలు  సంపాదించ‌డంతో పాక్ దీనిపై ఎలాస్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.   
దావూద్ కుటుంబం పాస్‌పోర్టులు!
రావ‌ల్పిండి నుంచి జీ-866537 నెంబ‌రుతో తొలిపాస్ పోర్టు, రెండోది జీ-267185, క‌రాచీ నుంచి మూడోది జీ-285901 జారీ అయ్యాయి. అత‌ని భార్య మ‌హ‌జ‌బీన్ (జె-5634473) కుమారుడు మొయిన్ (జె-588518), కుమార్తె మెహ్రాఖ్ (జె-563473, జె-563439) సోద‌రులు అనీస్‌, ముస్తాఖిమ్‌ల‌కూ పాక్ పాస్‌పోర్టులున్నాయి.