భారత్‌లో ఇంకో 16 మంది ఉగ్రవాదులున్నారు: నవీద్‌

తనతో పాటు మొత్తం 18 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని, మరో పది మంది చొరబడేందుకు ఎదురు చూస్తున్నారని జమ్ముకాశ్మీర్ ఉధంపూర్‌లో సజీవంగా పట్టుబడిన పాక్ ఉగ్రవాది ఉస్మాన్ అలియాస్ నవీద్‌ చెప్పాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని దారా షేర్ ఖాన్ గ్రామంలో జరుగుతోన్న క్యాంప్‌లో ప్రస్తుతం వారు ఉన్నారని వెల్లడించాడు. అతని నుంచి నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజన్సీ (ఎన్ఐఏ) అధికారులు మరిన్ని వివరాలు రాబట్టారు. 1965 ఆగస్ట్ 28 యుద్ధ విజయ వార్షికోత్సవం కావడంతో భారత్‌పై దాడులకు తెగబడాలని పాక్ నుంచి ఉగ్రవాదులకు ఆదేశాలందాయని, ఆగస్ట్ 28లోపు ఉగ్రవాద దాడులు ముమ్మరంగా జరిగే అవకాశముందని నవీద్‌ చెప్పాడు. 15 రోజులుగా ఎన్ఐఏ నవీద్‌ను విచారిస్తోంది. నవీద్‌కు సహకరించిన ట్రక్కు డ్రైవర్‌ కుర్షీద్ అహ్మద్ భట్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. నవీద్‌కు ఆశ్రయమిచ్చినవారి ఆచూకీ కోసం యత్నాలు ముమ్మరం చేశారు. కాశ్మీర్‌లో లష్కర్ ఎ తొయిబా కమాండర్ అబూ ఖాసిం ఆచూకీ చెప్పిన వారికి పది లక్షల రూపాయల నజరానా ఇస్తామని ఇప్పటికే ఎన్ఐఏ ప్రకటించింది. 2008 నవంబర్ 26 ముంబై దాడుల సూత్రధారి హఫిజ్ సయీద్ కుమారుడు తల్హా ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్, శిక్షణ వ్యవహారాలు చూసుకుంటున్నాడని అతను తెలిపాడు. వీళ్లందరినీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు తయారు చేస్తున్నాడని నవీద్‌ వెల్లడించాడు. నవీద్‌ సజీవంగా పట్టుబడటంతో పాకిస్థాన్ భారత్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల గురించి, భారత్‌లో అందుకు సహకరిస్తున్న వారి వివరాలు చాలావరకూ అధికారులు రాబట్టారు.