సురేందర్ రెడ్డికి ఇంకా కిక్ వదల్లేదు

కిక్-2 సినిమా నెగెటివ్ టాక్ తో నడుస్తోంది. నిర్మాత మాటల్లో చెప్పాలంటే సినిమా నష్టాల్లో ఉంది. అయినా దర్శకుడికి మాత్రం ఆ సినిమా ఇచ్చిన కిక్ ఇంకా వదిలినట్టు లేదు. తనకు మరో అవకాశమిస్తే కిక్-2కు కూడా సీక్వెల్ తీస్తానంటున్నాడు. కిక్-2 సినిమా విడుదలైన 48 గంటల తర్వాత ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ కుదిరితే కిక్-2 సినిమాకు సీక్వెల్ చేస్తానని ప్రకటించాడు. దీంతోపాటు రేసుగుర్రం సినిమాకు కూడా సీక్వెల్ చేయడం తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు. నిజానికి ఇలాంటి ఎంటర్ టైనింగ్ సస్పెన్స్ మూవీస్ కాకుండా.. జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చేయడం అంటే తనకు బాగా ఇష్టమంటున్నాడు సురేందర్ రెడ్డి. త్వరలోనే రామ్ చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నానని కూడా ప్రకటించాడు ఈ దర్శకుడు. వీటితో పాటు వీలైతే తన దగ్గరున్న డబ్బుతో ఓ నిర్మాణ సంస్థను కూడా నెలకొల్పే అవకాశముందని ప్రకటించాడు. మొత్తమ్మీద ఇప్పటికైనా కిక్-2 ప్రమోషన్ కోసం సురేందర్ రెడ్డి మీడియా ముందుకురావడం మెచ్చుకోదగ్గ విషయమే. సినిమా విడుదలకుముందు కొన్ని అభిప్రాయ బేధాల కారణంగా మొత్తం ప్రచారానికే దూరంగా ఉంటూ వచ్చాడు సురేందర్ రెడ్డి.