ప‌సికందును ప్రాణాలు తీసిన‌ ఎలుక‌లు!

స‌ర్కారు ద‌వాఖానాకు వెళితే వైద్యం మాటేమోగానీ, ప్రాణాలు పోతున్నాయి. ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కూడా లేని ప‌సికందును ఎలుక‌లు పొట్ట‌న‌పెట్టుకున్నాయి. ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న  గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చోటుచేసుకుంది. ప్ర‌భుత్వాధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపం, ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని నిర్ల‌క్ష్యం కార‌ణంగా బ‌తికున్న శిశువును ఎలుక‌లు కొరుక్కుతిన్నాయి. శిశువు మ‌ర‌ణించాక‌నైనా వారి హృదయం క‌ర‌గ‌క‌పోవ‌డం వారిలో గూడుక‌ట్టిన నిర్ల‌క్ష్య ధోర‌ణికి అద్దం ప‌డుతోంది. 
ఏం జ‌రిగిందంటే.. ? 
విజయవాడ కృష్ణలంకకు చెందిన చావలి  లక్ష్మి విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రిలో రెండో కాన్పులో ఈ నెల 17న మగ శిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు గుంటూరు ప్రభుత్వ దవాఖాన చికిత్సకోసం వచ్చింది. అప్పటి నుంచి శిశువుకు పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వారంరోజుల క్రితం శిశువుపై ఎలుకలు దాడి చేయడంతో తల్లిదండ్రులు వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయినా సిబ్బంది, వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మంగళవారం రాత్రి శిశువు కాలి, చేతి వేళ్లతోపాటు ఎడమ కన్నును ఎలుకలు కొరికేసి తీవ్రంగా గాయపరిచాయి. బుధవారం ఉదయం శిశువు పరిస్థితి గమనించిన  లక్ష్మి దంపతులు వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వైద్యసేవలందిస్తున్నా పరిస్థితి విషమించడంతో పసికందు మరణించాడు. ఆసుపత్రి సిబ్బంది వైఖరి వల్లే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
స్పందించిన హెచ్ ఆర్ సీ
ఈ ఘ‌ట‌న‌పై  న్యాయ‌వాది చ‌ద‌ల‌వాడ జ‌య‌కృష్ణ‌ మాన‌వ హ‌క్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన హెచ్ ఆర్ సీ సెప్టెంబర్ 11వ తేదీలోగా విచారణ నివేదిక కమిషన్‌కు అందజేయాలని గుంటూరు జిల్లా డీఎం అండ్ హెచ్‌వో, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ను ఆదేశించింది. ప్ర‌భుత్వం కూడా స్పందించింది. ఆసుప‌త్రి ఆర్ ఎంఓ, మ‌రో ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. బాధితుల‌కు రూ.2ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించింది. కార్య‌ద‌ర్శి స్థాయి అధికారితో విచార‌ణ జ‌ర‌పిస్తామ‌ని హామీ ఇచ్చింది.