జీజీహెచ్‌లో మూషికాల వేట!

గుంటూరు ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారం రోజుల పసికందును పొట్టన పెట్టుకున్న మూషికాలను తుద ముట్టించేందుకు, జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒక్కసారిగా వంద మంది పారిశుధ్య కార్మికులను రంగంలోకి దించి, ఆసుపత్రి ఆవరణకు చక్కదనం అద్దుతున్నారు. మూషికాలను పట్టేందుకు ప్రత్యేకంగా పొలంలో ఎలుకలు పట్టే నిపుణులను రప్పించారు. ఇప్పటివరకు వీరు ఏకబిగిన దాదాపు 500ల పైచిలుకు ఎలుకలను పట్టుకున్నారు. మరుగుదొడ్లను పరిశుభ్రం చేయించారు. ఎక్కడికక్కడ క్రిమి కీటకాలు రోగుల దరి చేరకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లి, సున్నంతో మార్కింగ్‌ చేశారు. రోగులు సహాయకులు తీసుకొస్తున్న సామగ్రిని పరిశీలించడం ప్రారంభించారు. పరిస్థితులను పారిశుధ్యం స్థితిగతులను అధికారులు నాయకులు స్వయంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు.
ఇద్దరు బదిలీ… ఇద్దరు నర్సుల సస్పెన్షన్‌
ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వానికి ప్రాథమిక విచారణ కమిటీ నివేదిక అందింది. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం.. ఘటనకు బాధ్యులను చేస్తూ సూపరింటెండెంట్ వేణుగోపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కరరావు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హెడ్ నర్స్ విజయలక్ష్మి, స్టాఫ్ నర్సు నిర్మలను సస్పెండ్ చేశారు. ఆస్పత్రుల శానిటేషన్, సెక్యూరిటీపై సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అధికారులు స్పందించి కఠిన నిర్ణయాలు తీసుకుంటారా లేక రాష్ట్ర వ్వాప్తంగా ఆస్పత్రుల్లో మెరుగైన పారిశుధ్య పరిస్థితులు కల్పిస్తారా అనేది ఇపుడు చర్చనీయాంశమైంది. కాగా ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు ధర్నా చేపట్టారు. వైద్యుడు భాస్కర్ రావు బదిలీ, ఇద్దరు నర్సుల సస్పెన్షన్‌కు నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టారు. బదిలీ, సస్పెస్షన్‌లను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండు చేశారు.