చప్పుడు చేయకండి… శాశ్వత’నిద్ర’లో ఉన్నాడు

Syrian-file-kidసుతిమెత్తగా ఉన్న ఇసుక పాన్పుపై సుకుమారమైన సముద్ర తరంగాల గాలికి ఒద్దికగా నిద్రపోతున్నట్టున్నాడీ పసిబిడ్డ… తల్లిదండ్రుల జ్ఞాపకాలను నిద్రలోనే పదిల పరుచుకున్నట్టు కనిపిస్తున్నాడు… ఆ నిద్రకు యక్షిణులు, దేవదూతలు కాపలా ఉన్నట్టున్నారు… ఈ పసివాడికి ఆ విషయం తెలీదు… తెలిసిన వాళ్ళకి నిజం గుండెను పిండేస్తుంది… అతని నిద్ర శాశ్వతం అన్న మాట తెలిస్తే చాలామంది గుండె పగిలిపోతుంది. హృదయం లేని విధి అతన్ని జీవశ్చవాన్ని చేస్తే భూమాత అక్కున చేర్చుకుంది. మానవత్వం మాత్రం అలల తాకిడికి కొట్టుకుపోయి జాడ కనిపించకుండా పోయింది. అవును! రెండో తీరం కనిపించని సంద్రంలో బహుశా ఆ చివరేమన్నా ఉందేమో మానవత్వం… చూడండి… ఈ దృశ్యాన్ని… చనిపోయిన ఓ మూడేళ్ళ పసివాడిది. టర్కీ నుంచి గ్రీక్‌ ద్వీపంలోని కోస్‌ ప్రాంతానికి వెళుతున్న ఓ శరణార్ధుల పడవ మునిగిపోయినపుడు జీవం కోల్పోయిన ఓ పసికందుది. ఈ పడవలో 11 మంది శరణార్ధులున్నట్టు ప్రసార సాధనాల కథనం. అందులో ఈ పసిబిడ్డ ఒకడు. గత జనవరి నుంచి ఇలా మెడిటేరియన్‌ సముద్ర జలాలను దాటుతూ 2600 మంది శరణార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అంతర్జాతీయ వలసవాదుల సంస్థ తెలిపింది. ఇంతమంది చనిపోయినప్పటికీ ఈ బాలుడి హృదయ విదారక దీనస్థితి అందరి మదినీ కలచివేసింది. ఈ ఫొటో సోషల్‌ మీడియాని షాక్‌కు గురి చేసింది.
3-year-kid