భారత్‌‌ను భారీగా నష్టపరుస్తాం: పాక్

యుద్ధం అంటూ వస్తే భారత్‌కు గట్టిగా బుద్ధి చెబుతామని పాకిస్థాన్ హెచ్చరించింది. పెద్ద స్థాయిలో భారత్‌ను దెబ్బతీస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చారు. మెరుపు యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉండాలని ఇండియన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పాక్ ఈ హెచ్చరిక జారీ చేసింది. గత యుద్ధాల్లో పాక్ ఆర్మీ పొరపాట్ల వల్ల ఓడిపోయామన్న ఆయన ఈ 50 ఏళ్లలో పాక్ సైన్యం అన్ని యుద్ధ తంత్రాల్లో ఆరితేరిందని చెప్పారు. యుద్ధం వస్తే తడాఖా చూపిస్తామన్నారు. భారత్‌తో తలపడిన మూడు యుద్ధాల్లోనూ పాక్ ఘోరంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ విమోచన సమయంలో 90 వేల మంది పాక్ సైనికులను మట్టి కరిపించే అవకాశం ఉన్నా మానవతా దృక్పథంతో వ్యవహరించి భారత్ క్షమాభిక్ష పెట్టింది. చైనా అండ చూసుకుని పాకిస్థాన్ రెచ్చిపోతోందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు.