ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహం

తుపాకీపై బైబిల్ ప్రవచనాలు, శిలువ బొమ్మ డిజైన్‌
ఇస్లామిక్ ఉగ్రవాదులు ప్రాణాంతక ఆయుధాలను ఉపయోగించకుండా కట్టడి చేసేందుకు అమెరికాకు చెందిన తుపాకీ ఉత్పత్తిదారుడు ఓ కొత్త చిట్కాను కనిపెట్టారు. తుపాకీకి ఓ పక్కన బైబిల్ వచనాలను, మరోపక్క శిలువను ముద్రించి ఏఆర్-15 అనే ఐఎస్‌ఐఎస్-ఫ్రూఫ్ ఆయుధాన్ని స్పైక్స్ టాక్టికల్ అనే కంపెనీ తయారు చేసింది. తుపాకీపై శాంతి, యుద్ధం, దేవుడి అనుగ్రహం అనే సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేసింది. ఇరాక్ సైనికులను బెదిరించి అమెరికా ఆయుధాలను జిహాదీ ఫైటర్లు పెద్ద ఎత్తున దోచుకెళ్లడం, ఆయుధ భాండాగారాల నుంచి లూటీ అంశాలను దృష్టిలో ఉంచుకొని ముస్లిం టెర్రరిస్టులు ఇక ముందు ఆయుధాలను ముట్టుకోకుండా ఇలాంటి తుపాకుల తయారీపై దృష్టిపెట్టామని కంపెనీ అధికార ప్రతినిధి, సీల్ నౌకదళ మాజీ అధికారి బెన్ మూకీ థాంప్సన్ పేర్కొన్నారు. ఆర్-15 ఆయుధాలను గతవారం మార్కెట్‌లో ప్రవేశపెట్టడంపై ఫ్లోరిడాలోని అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముస్లింలను అవమానించడానికి తామీ ప్రయత్నం చేయలేదని స్పైక్స్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.