హిట్లర్‌ – బుష్‌

ఎప్పుడో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది మంది ప్రజలు దీనాతిదీనంగా శరణార్ధులుగా దేశాలు విడిచి వలసలు వెళ్ళడం చూశాం.
మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇరాక్‌, సిరియా, లిబియా, టర్కీ మొదలైన దేశాల నుంచి లక్షలాది మంది శరణార్ధులు దీనాతిదీనంగా, ప్రాణాలు అరచేత పట్టుకుని కిక్కిరిసిన బోట్లలో  ప్రాణభయంతో యూరప్‌ తీరానికి చేరుకుంటున్నారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో కొంతమంది దారిలో చనిపోతున్నారు. అలా చనిపోయిన బాలుడి ఫోటో ప్రపంచాన్ని కంటతడిపెట్టించింది.

ఇంతమంది ఇలా శరణార్ధులుగా వలసలు రావడానికి కారణం ఏమిటి?
ఆయాదేశాల్లో తిరుగుబాట్లు. ప్రశాంతంగా బ్రతుకుతున్న, సెక్యులర్‌ దేశం ఇరాక్‌పై జూనియర్‌ బుష్‌, ఆయన దుష్ట కూటమి ఆయిల్‌కోసం చేసిన యుద్ధంలో 15 లక్షల మంది ఇరాకీలు చనిపోయారు. కడుపుమండిన మతవాదులు ఇస్లామిక్‌ ఉగ్రవాదులుగా మారారు. వాళ్ళవల్ల, అమెరికా ప్రోత్సాహం వల్ల అరబ్‌ ప్రపంచంలోని అనేకదేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి. తాలిబన్లను పెంచి పోషించి, శిక్షణ నిచ్చి, వారికి ఆయుధాలు అందించిన అమెరికా ఇప్పుడు తాలిబన్లను తప్పుపడుతోంది. తాలిబన్ల నుంచి పుట్టిన ఆల్‌కాయిదా ఉగ్రవాదాన్ని తప్పుపడుతోంది.
ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో అల్లకల్లోలమవుతున్న సిరియా, టర్కీ, ఇరాక్‌, లిబియా మొదలైన దేశాల్లో క్షణక్షణం భయంభయంగా బ్రతకలేక ప్రాణాలకు తెగించి ప్రజలు వలసబాట పడుతున్నారు. జూనియర్‌ బుష్‌ పాలనకు ముందు ప్రశాంతంగా బ్రతుకుతున్న అరబ్‌ ప్రపంచం అల్లకల్లోలంగా, దయనీయంగా తయారైంది. మన తెలుగువాళ్ళు బలరాం, గోపాలకృష్ణ కూడా ఈ ఇస్లామిక్‌ తీవ్రవాదుల దగ్గర బందీలుగా ఉన్నారు.
కోట్లాది మంది ప్రజల కన్నీళ్ళకు అప్పుడు హిట్లర్‌ కారకుడైతే ఇప్పుడు జార్జిబుష్‌ జూనియర్‌ కారకుడు.