సమగ్రాభివృద్ధిలో అట్టడుగు స్థానంలో భారత్‌!

అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి సాధనలో భారత్‌ అట్టడుగు స్థాయిలో ఉందని ప్రపంచ ఆర్ధిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) ఎత్తి చూపింది. తలసరి ఆదాయాల స్థాయి ఆధారంగా 112 దేశాలను వివిధ గ్రూపులుగా విభజించి రెండు సంవత్సరాలు అధ్యయనం చేసిన ఈ ఫోరం ‘సమ్మిళిత వృధ్ధి- దేశాభివృధ్ది’ శీర్షికన విడుదల చేసిన నివేదికలో భారత్‌ దాదాపుగా అన్ని అంశాల్లోనూ దిగువ స్థానంలోనే ఉంది. దిగువ మధ్య తరగతి ఆదాయం కలిగిన మరో 37 దేశాలతో భారత్‌ను కలిపి ఈ అధ్యయనాన్ని ప్రపంచ ఆర్థిక పోరం నిర్వహించింది. ’15 అంశాల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో భారత్‌ కీలకమైన అన్ని అంశాల్లోనూ దిగువ స్థాయికే పరిమితమైంది. ‘గత రెండేళ్లుగా ప్రపంచంలోని వివిధ దేశాలలోని విధానకర్తలు ఏకకాలంలో ఆర్థిక వృద్ధి, ఈక్విటీని పెంచేందుకు అవలంభించిన మార్గాలు, వాటిని అమలు చేయడం ద్వారా పొందిన విజయాల మదింపునకు ఈ కొత్త అధ్యయనం నిర్వహించాం. ఫలితాలు ఆశాజనకంగా లేవు. వివిధ దేశాల్లో పాలకులు తమకు లభించిన అవకాశాలను జారవిడు చుకుంటున్నారు’ అని డబ్ల్యుఇఎఫ్‌ వ్యాఖ్యానించింది. 15 అంశాల వారీగా వెల్లడించిన ఈ నివేదికలో అన్ని రంగాలలో మెరుగైన వృద్ధిని కనబరిచిన దేశం ఒక్కటి కూడా లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల జాబితాలో కనీస మౌలిక వసతులు, సేవల విభాగంలో స్విట్జర్లాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. విద్యా, నైపుణ్యతలు, ఆస్తుల సృష్టి నాయకత్వ నిర్మాణం విషయంలోనూ ఫిన్‌లాండ్‌ మేటిగా నిలిచింది. కార్మికులకు, ఉద్యోగులకు ఎక్కువగా పరిహారం చెల్లించే విషయంలో నార్వే ప్రథమ స్థానంలో ఉంది. కాని భారత్‌ మాత్రం ఏ విభాగంలోను తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకోలేక పోయింది.