ఐ ఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధం!

వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం! ఇటీవల విడుదలైన ఐఫోన్- 6ఎస్ మోడల్ ఫోన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న ఇద్దరు చైనా యువకులు దానికోసం ఏకంగా వారి కిడ్నీలనే అమ్ముకునేందుకు సిద్ధమైపోయారు. చైనాలోని జాంగ్ గ్జూ రాష్ర్టంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  వూ, హువాంగ్ అనే యువకులు మిత్రులు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్- 6ఎస్ ఫోన్ పై మనసు పారేసుకున్నారు. ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు.కానీ, ఫోన్ కావాలి. ఎలా? అంటూ తీవ్రంగా ఆలోచించారు. ఇంత‌లో వారికి ఓ ఐడియా వ‌చ్చింది. ఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా వారి కిడ్నీలు అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆన్లైన్లో వెదికారు. చివరికి అవయవాలు కొనుగోలు చేసే ఓ బ్రోకర్ ఫోన్ నెంబరు సంపాదించారు. అతన్ని సంప్రదించగా.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రమ్మన్నాడు. అతను చెప్పినట్లుగానే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నా.. బ్రోకర్ ఎందుకో ఆసుపత్రికి రాలేదు. ఈలోగా వూ మనసు మార్చుకున్నాడు. ఫోన్ కోసం కిడ్నీలు అమ్మవద్దంటూ హువాంగ్ కు నచ్చజెప్పాడు. కానీ హువాంగ్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. చేసేదిలేక వూ పోలీసులకు విషయాన్ని చెప్పాడు. తన గురించి పోలీసులు వెదుకుతున్నారని తెలిసి హువాంగ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అంతేకానీ, తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు.