ప్రజలను మోసం చేస్తున్న మోడీ, బాబు: వైఎస్‌ఆర్‌సీపీ

కేంద్రంలోని మోడీ సర్కారుకు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టిన చంద్రబాబు, ప్రత్యేక హోదా అంటూ నాటకాలాడుతున్నారని వైసీపీ నేతలు ఆర్‌కే రోజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ నెల 26 నుంచి గుంటూరులో జగన్ దీక్ష ప్రారంభించనున్న ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కోట్లు ఖర్చుచేసి నిర్మాణం చేస్తున్న పట్టిసీమలో నాణ్యత లేదని అన్నారు. కొద్దిపాటి వరదలకు కాలువ గట్టు కొట్టుకుపోవడం చంద్రబాబు అవినీతి, అక్రమాలకు అద్దం పడుతున్నదని చెప్పారు.ఏపీని టీడీపీ, బీజేపీ రెండూ మోసం చేశాయని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కలిసి ఆంధ్రలో పర్యటించిన మోడీ ప్రత్యేక హోదా గురించి ఇచ్చిన హామీలు అటకెక్కాయని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్ వత్తిడితోనే అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు మాట్లడడంలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. కేంద్రం మెడలువంచైనా రాష్ర్టానికి ప్రత్యేకహోదా సాధిస్తామని స్పష్టంచేశారు.