ఖైరతాబాద్‌ గణేశుడి ప్రసాదం కోసం 2 కిలోమీటర్ల క్యూ

ఖైరతాబాద్ గణేశుడి మహా లడ్డు ప్రసాదం కోసం భక్తులు పెద్దసంఖ్యలో గణేశ మంటపం వద్ద బారులు తీరారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అయితే భక్తులు ఇంత పెద్దసంఖ్యలో వస్తారని ఊహించని నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవటంతో అక్కడ భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. భక్తులతోపాటు అక్కడ విధులలో ఉన్న పోలీసులు కూడా ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. కొందరు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. పలువురు భక్తులతోపాటు పోలీసులు కూడా ఈ సంఘటనలో గాయపడ్డారు. ప్రసాదంకోసం గత ఏడాది కంటే ఈసారి విపరీతంగా భక్తులు వచ్చారు. ప్రసాదం పంపిణీ ముందు ప్రకటించినట్లే ఇవాళ ఉదయం ప్రారంభమయింది. భక్తులను అదుపు చేయడం పోలీసులకు సవాలుగా మారింది. ఒక్కసారిగా దూసుకురావడంతో బారికేడ్లు ధ్వంసమై పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొంచెం సేపు ప్రసాదం పంపిణీని నిలిపి వేశారు. గణేశ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ వినాయకుడి కోసం తూర్పు గోదావరిజిల్లాలోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ 5,600 కేజీల లడ్డును ప్రసాదంగా పెట్టడానికి తయారు చేసింది. విగ్రహాన్ని మొన్న నిమజ్జనం చేసిన తర్వాత లడ్డును భద్రపరిచిన నిర్వాహకులు ఇవాళ ఆ ప్రసాదాన్ని పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేశారు.  కవర్లలో పంపిణీ చేస్తామని ముందు ప్రకటించిన నిర్వాహకులు అలాంటి ఏర్పాట్లేమీ చేయలేదు. అందరికీ చేతిలో పెట్టడం… ఒకేసారి భక్తులు ఎగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.