మహిళను బంధించి దోపిడీ దొంగల బీభత్సం

ఓ మహిళ కాళ్ళూచేతులు కట్టేసి నగదు, నగలు దోచుకుపోయారు దోపిడీ దొంగలు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం సుకర్లాబాద్‌ ప్రాంతంలో జరిగింది. అర్ధరాత్రి ఓ ఇంట్లో చొరబడిన దొంగలు వచ్చిన వెంటనే సునీత అనే మహిళను కత్తులతో బెదిరించి గొంతుకు తాడు బిగించారు. నోటిలో గుడ్డలు కుక్కేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆమె మాట్లాడకుండా చేయడమే కాకుండా ఊపిరాడకుండా చేశారు. కాళ్ళూ చేతులూ కట్టేసి నగలు, నగదు మూటకట్టేశారు. వెళుతూ వెళుతూ తలుపులు దగ్గరకు వేసేసి వెళ్ళి పోయారు. ఉదయం ఆమెను అపస్మారక స్థితిలో చూసి పొరుగున ఉన్నవారు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఫిర్యాదు అందుకుని సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి దర్యాప్తును ప్రారంభించారు. దొంగల కోసం గాలిస్తున్నారు.