సోమ్‌నాథ్‌భార‌తికి బెయిల్‌

గృహ హింస, హత్యాయత్నం కేసుల్లో అరెస్టయిన ఆప్ ఎమ్మెల్యే , ఢిల్లీ రాష్ర్ట మాజీ న్యాయ‌శాఖా మంత్రి సోమ్‌నాథ్ భార‌తికి ఢిల్లీ సిటీకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ సిటీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని, విచారణ పూర్తయ్యేంత వరకు దేశం విడిచి వెళ్లరాదని అడిషిన‌ల్ సెష‌న్స్ జ‌డ్జి అనిల్ కుమార్ ఆదేశించారు. భార్య లిపికా మిత్రా ఇచ్చిన ఫిర్యాదుపై సోమ్‌నాథ్ ఐపీసీ లోని వివిధ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. దీంతో సోమ్‌నాథ్ భార‌తి అజ్ఞాతంలోకి వెళ్లారు. ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన భార‌తి సోమ‌వార‌మే పోలీసుల ఎదుట లొంగిపోయారు. పెళ్ల‌యిన నుంచి త‌న‌ను శారీర‌కంగా మాన‌సికంగా వేధిస్తున్నాడ‌ని భార‌తిపై భార్య ఫిర్యాదు చేసింది. దీనిపై ఢిల్లీ పోలీసులు గృహ‌హింస చ‌ట్టంతోపాటు వివిధ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు.