నైజీరియ‌న్ల బాట‌లో హైద‌రాబాద్ ముఠా!

మీకు లాట‌రీ త‌గిలింద‌ని న‌కిలీ ఈ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు పంపి జ‌నాల డ‌బ్బు దండుకునే నైజీరియ‌న్ ముఠాల‌నే ఇంత‌వ‌ర‌కూ చూశాం. వారి నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా బ్రిట‌న్, అమెరికా వాసుల‌కే టోక‌రా వేస్తూ వేలాది డాల‌ర్లు కొట్టేసిన ఓ భార‌తీయ ముఠా గుట్టు ర‌ట్ట‌యింది. వివ‌రాలు.. గుజ‌రాత్‌కు చెందిన ఇషాన్ పాఠ‌క్ సాఫ్ట్‌వేర్ నిపుణుడు సులువుగా డ‌బ్బు సంపాదించేందుకు వ‌క్ర‌మార్గాన్ని ఎంచుకున్నాడు. అమెరికా, బ్రిట‌న్‌లో వివిధ బ్యాంకుల‌కు రుణాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి డేటాను హ్యాకింగ్ ద్వారా సేక‌రించేవాడు. వారికి ఫోన్ చేసేందుకు హైద‌రాబాద్‌లోని రెయిన్‌బజార్‌లో పర్వేజ్ కాలింగ్ సొల్యూషన్స్, టోలీచౌకిలో క్విక్ క్యాష్ లోన్స్, క్యాష్ సేమ్ డే, పంజగుట్టలో ఏబీ కాలింగ్ సొల్యూషన్స్ పేరిట కాల్ సెంట‌ర్ల‌నే తెరిచాడు. అందులో సాఫ్ట్‌వేర్ నిపుణుల్ని నియ‌మించుకున్నాడు. వారికి క‌స్ట‌మ‌ర్ల‌ను ఎలా బోల్తా కొట్టించాలో శిక్ష‌ణ ఇచ్చాడు. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి.. లోన్ మంజూరు అయిందంటూ ఫోన్ చేసేవారు. నెల‌స‌రి వాయిదా వివ‌రాలు చెప్తారు.

వెంట‌నే మ‌రో వ్య‌క్తితో ఫోన్ చేయించి మీరు 1000 డాల‌ర్ల‌కు 110 డాల‌ర్ల చొప్పున ముంద‌స్తుగా చెల్లించాల‌ని అనేవారు. క‌స్ట‌మ‌ర్ ఒప్పుకోగానే..మ‌రో ఏజెంట్ ఫోన్ చేస్తాడు. అమెరికా బ్రిట‌న్‌లో ఈజీ క్యాష్ ద్వారానే న‌గ‌దు చెల్లింపులు జ‌రుగుతాయి. ఈ విధానంలో ముందుగా చెల్లింపులు చేయ‌మ‌నే వారు. ఉదాహ‌ర‌ణ‌కు 5 వేల డాల‌ర్ల‌కు 550 డాల‌ర్లు కట్టించుకునేవారు. త‌రువాత వీరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి. లండ‌న్‌లో ఉన్న ఇషాన్ మిత్రులు ఆ డ‌బ్బును క‌లెక్ట్ చేసుకుని క‌మీష‌న్ పోను మిగిలిన డ‌బ్బును ఇండియాకు హ‌వాలా మార్గంలో పంపేవారు. పోలీసు త‌నఖీల్లో ఓ ల్యాప్‌టాప్ గురించి ఆరాతీయ‌గా అందుకు ముఠా స‌భ్యులు అంగీక‌రించ‌లేదు. అనుమానం వ‌చ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలిలో ప్ర‌శ్నించ‌గా ముఠా మోసం బ‌య‌ట‌ప‌డింది.