చవకైన నివాసిత నగరం ముంబాయి

ప్రపంచంలోని అత్యంత చవకైన నగరాల్లో మన ముంబయి నగరం మొదటిస్థానంలో ఉంది. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగుల నివాస యోగ్యతలను దృష్టిలో పెట్టుకుని సావిల్స్ అనే ప్రపంచ పరిశోధనా సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచలోని 12 మెట్రో పాలిటన్ నగరాల్లో సావిల్స్‌ ఈ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో ముంబయి అత్యంత చవకైన నగరంగా నిలించింది. లండన్, హాంగ్‌కాంగ్, న్యూయార్క్‌ నగరాలు అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. కార్యాలయాల నిర్వహణ, ఉద్యోగి నివాస యోగ్యత పరంగా ముంబయి నగరంలో సంవత్సరానికి 29,088 డాలర్లను వెచ్చిస్తున్నారు. ఖర్చుల పెరుగుదల కూడా 2008తో పోల్చుకుంటే 2.4 శాతం మాత్రమే ఉంది. అదే మొదటిస్థానంలో ఉన్న లండన్‌ 20.7 శాతం పెరుగుదలతో 118,425 డాలర్లుగా ఉంది. షాంఘైలో 15.6 శాతం పెరుగులతో 38,089 డాలర్లుగా ఉంది. మొత్తంమీద భారత్‌ను నివాస యోగ్యంగా ఎన్నుకునేందుకు ఈ సర్వే బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.