హీరో విశాల్‌పై దాడి

నడిగర్ సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఏకంగా దాడులకు దిగుతున్నారు. ఆదివారం జరుగుతున్న పోలింగ్ సందర్భంగా హీరో విశాల్‌పై నటుడు శరత్‌కుమార్ వర్గీయులు దాడి చేశారు. దాడిలో విశాల్ ఎడమచేతికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు . ఓటమి భయంతోనే శరత్‌కుమార్ వర్గీయులు ఇలా బౌతికదాడులకు దిగుతున్నారని విశాల్ ఆరోపించారు. చెన్నైలోని ఆళ్వార్‌పేటలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

గత పదేళ్లుగా శరత్‌కుమార్ టీమే నడిగర్ సంఘానికి కార్య నిర్వాహకవర్గంగా కొనసాగుతుంది. అయితే ఈసారి శరత్‌కుమార్ తీరుపై తిరుగుబాటు అన్నట్టుగా విశాల్ వర్గం బరిలో దిగింది. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుటి నుంచి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. విశాల్ తెలుగువాడు కావడంతో ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించేందుకు శరత్ కుమార్ వర్గం ”విశాల్ రెడ్డి” అంటూ ప్రచారం చేసింది. చివరకు ఇలా దాడులకు కూడా సిద్ధమయ్యారు. విశాల్‌పై దాడి నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విజేతలెవరన్నది కూడా ఆదివారం సాయంత్రం తేలిపోనుంది.