ప్రేమజంటకు సహకరించి… ఓ మహిళ మృతి

పెద్దలకు ఇష్టం లేని ఓ ప్రేమ జంటను కలపాలని ఇద్దరు మహిళలు చేసిన ప్రయత్నంలో ఒకరు ప్రాణం కోల్పోయారు. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ సంఘటన జరిగింది. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామంలో ఓ యువ జంట ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన ఇద్దరు మహిళలు వారికి అండగా నిలబడ్డారు. వారి ప్రేమకు సహకరిస్తూ పెళ్ళికి చేయూత ఇవ్వాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన యువతి తరఫు బంధువులు ఈ ఇద్దరు మహిళలపై దాడి చేసి చితకబాదారు. దీంతో వారు అవమానానికి గురయ్యారు. అందరిలో తలెత్తుకు తిరగడానికి మనసొప్పలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఆత్మహత్యా యత్నం చేశారు. వీరిలో రేణుక అనే మహిళ మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.