పవన్‌కు పరీక్ష

రాజధాని ప్రాంతంలో భూములివ్వని రైతుల నుంచి బలవంతంగానైనా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూసమీకరణ కింద భూములివ్వని వారిపై భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామని బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి తొలుత తుళ్లూరు మండలంలో 300 ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. రెండో విడతలో ఉండవల్లి, పెనుమాక, బేతపూడిలో 900 ఎకరాలు సేకరిస్తామన్నారు. మొత్తం 2,159 ఎకరాల భూములను భూసేకరణ కింద తీసుకుంటామని మీడియా సాక్షిగా ప్రకటించారు.

కొద్ది రోజుల క్రితం కూడా భూసేకరణ అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించింది. కానీ వైసీపీ, పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించడంతో భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కు తీసుకుంది. పవన్ కోరిక మేరకే భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కు తీసుకుంటున్నట్టు మంత్రి నారాయణ అప్పట్లో చెప్పారు కూడా. మరి ఇప్పుడు తిరిగి భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా పవన్‌ను టీడీపీ రెచ్చగొడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్‌కు ప్రభుత్వం భయపడుతోందన్న అభిప్రాయం తొలగించాలని టీడీపీ భావిస్తున్నట్టుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పవన్ వల్లే నోటిఫికేషన్ వెనక్కు తీసుకుంటున్నామని చెప్పిన ఇదే మంత్రులు ఇప్పుడు తిరిగి భూసేకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తామని చెబుతున్నారంటే దాని వెనుక తెగింపు దోరణి కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్‌తో స్నేహాన్ని వీడి అమితుమి తేల్చుకునేందుకే టీడీపీ సిద్ధమైనట్టుగా అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే టీడీపీ ప్రభుత్వం ఈసారి వెనక్కు తగ్గే సూచనలు కనిపించడం లేదు. మరి పవన్ కల్యాణ్ రైతుల పక్షాన ప్రభుత్వంపై ఎలా పోరాటం చేస్తారో చూడాలి. పవన్ దూకుడు గెలుస్తుందో… లేక చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తాయో త్వరలోనే తేలుతుంది. పవన్ మాత్రం రాజకీయంగా నిలబడాలంటే ఏదో ఒకటి మాత్రం చేయకతప్పదు.