చిన్నారి కోరిక తీర్చిన స్మితా సబర్వాల్

తీవ్ర వ్యాధుల బారిన పడ్డ చిన్నారుల కోరికలను తీర్చేందుకు మేక్ ఏ విష్ సంస్థ పనిచేస్తోంది. చిన్నారులకు ఏవైనా కోరికలుంటే వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఇప్పటి వరకుచాలా మంది చిన్నారులు సినిమా స్టార్లను చూడాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడా జాబితాలో తెలంగాణ సీఎంవో సహాయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కూడా చేరారు.

చిన్నప్పటి నుంచి తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్న  కరీంనగర్ జిల్లా పెగడపల్లికి చెందిన  నిహారిక  తనకు స్మితా సబర్వాల్‌ను చూడాలని ఉందని మేక్ ఏ విష్ సంస్థను కోరింది. దీంతో సంస్థ ప్రతినిధులు స్మితా సబర్వాల్‌ను సంప్రదించగా ఆమె ఆనందంగా ఒప్పుకున్నారు.  నేరుగా నిహారిక ఇంటికి వెళ్లి చిన్నారిని స్మితాసబర్వాల్ పరామర్శించారు.  దాదాపు గంట పాటు అక్కడే గడిపారు.

నిహారికకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  వైద్యానికి అవసరమైన సాయం చేస్తానని చెప్పారు.   ఉన్నత చదువులు అందించేందుకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని, స్వచ్ఛంద సంస్థలు కూడా అండగా నిలవాలని కోరారు. స్మిత సబర్వాల్ నేరుగా తన ఇంటికి రావడంతో చిన్నారి చాలా ఆనందంగా ఫీలైంది.