కేసీఆర్, కడియం మధ్య గ్యాప్ అందుకే

రాజకీయాల్లో అత్మీయతలు, అనురాగాలు స్టాక్ మార్కెట్ సూచిలాంటివి. అవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు కూలుతాయో అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మధ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య చేత రాజీనామా చేయించి ఏరికోరి కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎంగా కేసీఆర్ నియమించుకున్నారు. అందుకోసం కడియం చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించారు. దాని వల్లే ఇప్పుడు వరంగల్ లోక్‌సభకు ఉప ఎన్నిక కూడా వచ్చింది. అయితే తీరా ఓరుగల్లు పోరు వేళ ఈ ఇద్దరి మధ్య గ్యాప్ గోదావరి అంత వెడల్పుగా పెరిగిందని నేతలు చెబుతున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యాలను కూడా చూపుతున్నారు.

ఇటీవల కడియంకు కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని సమాచారం. డిప్యూటీ సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రిగాను ఉన్న కడియంను ఇటీవల కేజీ టూ పీజీ విద్యావిధానంపై జరిగిన సమీక్షకు సీఎం కేసీఆర్ ఆహ్వానించలేదు. అంతేకాదు ఇటీవల జరిగిన టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశానికి కూడా కడియం శ్రీహరి హాజరు కాలేదు. దీని బట్టే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చంటున్నారు పార్టీ నేతలు.

వీరి మధ్య ఇంత గ్యాప్ రావడానికి కారణాలను కూడా ఆ పార్టీ వ్యవహారాలను ఫాలో అయ్యే మీడియా ప్రతినిధులకు కొందరు నేతలు వివరించారు. వరంగల్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై కడియం శ్రీహరి సూచనలు చేశారు. అయితే దాన్ని కేసీఆర్ లెక్కచేయలేదు. దీని కారణంగా ఇటీవల జిల్లాలో తానే నెంబర్ వన్ అని కడియం శ్రీహరి పార్టీ నేతల వద్ద అన్నారట. అంతే కాకుండా మాజీ మంత్రి రాజయ్య భార్యను ఎంపీ అభ్యర్థిగా నిలిపితే ఎలా ఉంటుదన్న దానిపై కేసీఆర్ నిఘా వర్గాల ద్వారా సర్వే చేయించారట. ఈ విషయంపైనా కడియం నోరు జారి తీవ్ర వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.

జిల్లాలో తానే నెంబర్ వన్ అని చెప్పుకోవడం, పదేపదే కేసీఆర్ నిర్ణయాలపై పార్టీ నేతల వద్ద తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్లే కడియం శ్రీహరిని సీఎం దూరంగా పెట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు.  రాజ్యంలో రాజు ఒక్కడే ఉండాలి. సామంతరాజులను కేసీఆర్ అస్సలు అంగీకరించరు.