లిక్కర్ మాఫియా ఒత్తిడికి లొంగిన చంద్రబాబు

లిక్కర్ లాబీ తలుచుకుంటే ముఖ్యమంత్రి అయినా ఒత్తిడికి తలొగ్గాల్సిందే. అవును ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 13 జిల్లాల్లో నడుస్తున్న 427 మద్యం షాపులను ప్రైవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈమేరకు సంబంధిత శాఖ అధికారులు కూడా చర్యలకు సిద్ధమయ్యారు. నవంబర్ నెలాఖరుకల్లా 427 మద్యం షాపులు ప్రైవేట్ పరం అవుతాయి.
నిజానికి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు తమిళనాడు తరహాలో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించి ప్రజలకు క్వాలిటీ మద్యం ఇస్తామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత లిక్కర్ మాఫియా ఈ ప్రయత్నాలకు గండికొట్టింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మద్యం షాపుల విషయంలో యూటర్న్ తీసుకోబోతోంది. జూలైలో అమలులోకి వచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ విధానం ప్రకారం 10శాతం మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తోంది.
అయితే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించేందుకు సిద్ధమైంది. తగినంతమంది సిబ్బంది లేకపోవడమే దీనికి కారణంగా చూపుతోంది ప్రభుత్వం. నిజానికి ప్రభుత్వం అమ్మే మద్యం షాపుల్లో ఎంఆర్ పీ ధరతోపాటు, క్వాలిటీ లిక్కర్ ఉంటుందని మందుబాబుల నమ్మకం. అందుకే ప్రైవేట్ షాపుల కంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే షాపుల వద్దే ఎక్కువ కొనుగోళ్లు జరుగుతున్నట్టు లెక్కలు కూడా ఉన్నాయి. ఇదే లిక్కర్ మాఫియాకు ఇబ్బందికరంగా మారింది. రంగంలోకి దిగిన లిక్కర్ వ్యాపారులు చంద్రబాబుపైనా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ నవంబర్ నెలాఖరుకల్లా 427 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు అంతా సిద్ధం అవుతున్నారు.