వరంగల్ లో గెలుపుపై ఎందుకంత ధీమా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆపార్టీలో కదనోత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటారా? వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష మెజార్టీతో గెలుస్తుందని వాళ్ల సర్వేలో తేలిందట. అందుకే ఇప్పుడా పార్టీలో ఎక్కడలేని సంతోషం కనిపిస్తోంది. అధిష్టానం బలమైన అభ్యర్థిని నిలబెడితే టీఆర్ ఎస్ ను ఓడించడం పెద్ద కష్టం కాదంటున్నారు హస్తం నాయకులు.
మొదట్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంలోనే ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హుషారుగా ఉన్నారు. వరంగల్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నోటిషికేషన్ రాక ముందు ఒకసారి, వచ్చాక మరోసారి సర్వే చేయించింది. ఇందుకోసం సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. టీకాంగ్రెస్‌ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకపోయినా.. లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుస్తామని స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో అటు ముఖ్య నాయకుల్లోనూ, ఇటు కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది.
గత ఎన్నికల్లో ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3 లక్షలా 96 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఉపఎన్నికలో దాన్ని అధిగమిస్తామంటున్నారు టీకాంగ్ నేతలు. పార్టీ గెలుపు మీదే కాదు…ఏ అభ్యర్థిని నిలబెడితే విజయావకాశాలు ఎలా ఉంటాయి? అనే దానిపై కూడా వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో సర్వే చేయించింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌కే ఓటు బ్యాంక్‌ బలంగానే ఉందని తేలింది. అయితే అభ్యర్థిని బట్టి ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు సర్వే ఫలితాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కొందరు పేర్లతోనూ సర్వే చేయించారు. అయితే ఆ వివరాలు మాత్రం బయటకు రావడం లేదు. మొత్తానికి అభ్యర్థి బలమైన వ్యక్తి అయితే గెలుపు హస్తానిదేనని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.