వణుకుతున్న ఏజెన్సీ తెలుగు తమ్ముళ్లు

విశాఖ ఏజెన్సీ టీడీపీ నేతలు ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఎన్నో ఏళ్లుగా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నా వాటిని లెక్కచేయని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నర్సీపట్నం రిజర్వ్ ఫారెస్ట్ డివిజన్‌లోని 1212 ఎకరాల్లో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చింది. తవ్వకాల బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగిస్తూ ఉత్వర్తులు జారీ చేసింది.

ఈనేపథ్యంలో ఏజెన్సీలోని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బాక్సైజ్ తవ్వకాలకు ప్రభుత్వం సానుకూలంగా అడుగులు వేయడంతో ఇటీవల ముగ్గురు టీడీపీ నేతలను మావోయిస్టులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కొద్ది రోజుల తర్వాత వదిలిపెట్టారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడాలని హెచ్చరించి మరీ వదిలిపెట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏజెన్సీ ప్రాంతంలోని టీడీపీ దిగువ స్థాయి నేతలు హడలిపోతున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మావోయిస్టులు తొలుత టార్గెట్ చేసేది తమనేనని వారు భయపడుతున్నారు. అవసరమైతే రాజీనామాలు చేసి రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచన కూడా కొందరు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాలను అనుమతివ్వడం చర్చనీయాంశమైంది.

Also Read: ఆ ఇద్ద‌రు పార్టీని ముంచారా?