అనంత వేరుశనగపై రాబందుల దాడి

అనంతపురం… అసలే కరువు జిల్లా. ఏడాదిలో పడే కాసింత వర్షానికి ఎంతో ఇంతో వేరుశనగ మాత్రమే పండుతుంది. ఆ పంట కూడా లాటరీ లాంటిదే. ఒక్కో ఏడాది అస్సలు పంట అన్న ఊసే ఉండదు. అలాంటి జిల్లాలో ఇప్పుడు వేరుశనగ రైతులకు దళారీల చీడపీడ పట్టింది. ఈ చీడ నుంచి రైతును కాపాడాల్సిన అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం కూడా నాసిరకం పురుగు మందులా తయారయ్యారు.  దీంతో ధరల సూచి దళారుల సొంత మంత్ర దండగా మారింది.

సరిగ్గా నెల రోజుల క్రితం బస్తా వేరుశనగ( 45 నుంచి 47 కిలోలు) ధర మూడు వేలు పలికింది. కానీ ఎప్పుడైతే రైతులు వెరుశనగ పంటను అమ్మడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచే వ్యాపారాల మాయాజాలం మొదలైంది. నెల క్రితం మూడు వేలున్న ధర ఇప్పుడు 15 వందలకు పడిపోయింది. అయితే ఉత్పత్తి అధికం అవడం వల్ల ధరలు పడిపోయాయనుకుంటే పొరపాటే. ఎప్పటిలాగే అరకొరగా పంట పండింది. కానీ వ్యాపారులు సిండికేట్ అయి ఇలా ధరలను పతనం చేశారు. వ్యాపారుల పోకడ, రైతుల దుస్థితి ఎలా ఉందంటే గతంలో 43 కిలోలనే బస్తాగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు 45 నుంచి 47 కిలోల వరకు కొల్లగొడుతున్నారు. ధర మాత్రం పెంచలేదు.

ధరల తగ్గుదలపై ఇదెక్కడి న్యాయం అని రైతులెవరైనా ప్రశ్నిస్తే ఇష్టముంటే అమ్మండి లేకుంటే లేదు అని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వ్యాపారులంతా సిండికేట్ కావడంతో సదరు రైతు నుంచి మరో వ్యాపారి కూడా పంట కొనుగోలు చేయరు. ఇలా రైతులను ఒక గత్యంతరం లేని దుస్థితిలోకి నెట్టి వారి కష్టంపై కాసులేరుకుంటున్నారు దళారులు. ఇంత అన్యాయం జరగుతుంటే అధికార యంత్రాంగం గానీ, నేతలు గానీ ఏం చేస్తున్నారన్న అనుమానం రావడం ఖాయం. కానీ అధికార పార్టీ నేతలు వారి సొంత సంపాదనలో బిజీగా ఉన్నారు. 

డ్వాక్రా సంఘాల ద్వారా గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే వేరుశనగ కొనుగోలు చేస్తుందని జిల్లాకు చెందిన అధికార పార్టీ పెద్దలు గొప్పలు చెప్పారు. కానీ వాటి పత్తా లేదు . వ్యాపారుల లాబియింగ్‌ వల్లే ప్రభుత్వ కొనుగోళ్లు జరగడం లేదన్నది బహిరంగ రహస్యం. ఇక జిల్లా ఉన్నతాధికారుల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆయనే ఉంటే తెల్లచీరతో పనేంటన్నట్టు పరిస్థితి తయారైంది. రైతుల రక్తాన్ని నిత్యం వ్యాపారులు ఇలా తాగేస్తుంటే వారి ఇళ్లలో మరణ మృదంగం కాక… మణిశర్మ మ్యూజిక్ వినిపిస్తుందా అన్న ఆగ్రహం వ్యక్త మవుతోంది.