దావూద్‌కు బుద్ధి చెబుదాం: బ్రిటన్‌కు మోదీ మొర

మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహింకు తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే తమకు సహకారం అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ను కోరనున్నారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న మోదీ దావూద్‌ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఇరు దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇతను పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్నట్టు అన్ని దేశాలకు తెలిసినా ఎవరూ ఏమీ చేయలేకపోవడం గమనించాలని, దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దావూద్‌ ఉగ్రవాద కార్యకలాపాలపై తయారు చేసిన డోసియర్‌ను ఈ సందర్భంగా భారత్‌ ప్రతినిధులు బ్రిటన్‌కు అందించనున్నారు. లండన్‌లోని సెయింట్‌ జాన్‌ రోడ్‌లో ఉన్న ఓ భవంతి నుంచి దావూద్‌ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ అంశంతోపాటు బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో దావూద్‌ ఇబ్రహింకు ఉన్న అక్రమ వ్యాపారాలు, ఆస్తుల వివరాలను కూడా భారత విదేశాంగ శాఖ సేకరించింది. ఈ వివరాలను కూడా కామెరూన్‌కు భారత్‌ దౌత్యాధికారులు అందించనున్నారు. దావూద్‌ ఉగ్రవాద, అక్రమ కార్యకలాపాలతో బ్రిటన్‌తోపాటు భారత్‌కు ఎదురయ్యే ముప్పును గురించి భారత్‌ విదేశాంగ శాఖ ఈ సందర్భంగా కామెరూన్‌కు వివరించనున్నట్లు తెలిసింది.