తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్‌?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజురోజుకీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆర్థిక శాఖ సతమతమయిపోతోంది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవద్దని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా మంజూరు చేసిన బిల్లుల్లో కోటి రూపాయల లోపు బిల్లులు మాత్రమే అనుమతి లేకపోయినా మంజూరు చేయమని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ సంస్థకు కూడా లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఓసీ) జారీ చేయవద్దని ఆర్థిక శాఖను కోరింది. గత ఇరవై రోజుల నుంచి రూ. 400 కోట్ల రూపాయల విలువ చేసే బిల్లులు డబ్బుల్లేక నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ తదితర అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. నిధుల విడుదల కోరుతూ అధికారులంతా ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. తమ పెండింగ్‌ బిల్లులకు మోక్షం కలిగించాలని కోరుతూ వివిధ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు సచివాలయం చుట్టూ చక్కెర్లు కొడుతున్నారు. విశ్వవిద్యాలయాలకు, కొన్ని సంస్థలకు మాత్రమే ట్రెజరీలు ఎల్‌ఓసీలు జారీ చేస్తున్నారు. ఎల్‌ఓసీ విడుదలయిన సంబంధిత సంస్థలు ఏ క్షణమైనా నిధుల్ని డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసరాలకు మాత్రమే ట్రెజరీలు కూడా ఎల్‌ఓసీలు ఇస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి శతథా ప్రయత్నిస్తున్నట్టు ఆర్థిక శాఖలో సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.