వార్షికాదాయం పరిమితితో గ్యాస్‌ సబ్సిడీ కట్‌?

గ్యాస్‌ సబ్సిడీని సాధ్యమైనంత వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా రూ. 10 లక్షల రూపాయలకు పైగా వార్షికాదాయం ఉండే గ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీని తొలగించాలని కేంద్రం భావిస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. గ్యాస్‌ సబ్సిడీని ఇప్పటివరకు తమంత తాముగా ముఫ్ఫై లక్షల మంది వదులుకున్నారని అయినా సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి వస్తోందని ఆయన అన్నారు. అయితే ఇప్పటికీ దేశంలో భారీగా అక్రమ గ్యాస్‌ కనెక్షన్‌లు ఉన్నాయని, వారందరినీ గుర్తించి గ్యాస్‌ సరఫరా నిలిపివేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదా చేయ వచ్చని వెంకయ్యనాయుడు తెలిపారు. అక్రమ కనెక్షన్‌లు తొలగించి అర్హులకు ప్రయోజనం చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వార్షికాదాయం పరిమితిని నిర్ణయించి దానికి అనుగుణంగా కేంద్రం సబ్సిడీని ఎత్తివేయాలని యోచిస్తున్నట్టు మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా చెప్పారు.