టీఆర్‌ఎస్‌ది గురువింద ప్రభుత్వం: దత్తాత్రేయ

కరువు మండలాలను సకాలంలో ప్రకటించడం తెలియని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించే అర్హత ఏముంటుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. బీహార్‌ ఎన్నికల ఫలితాలను అడ్డం పెట్టుకుని నరేంద్రమోదీపై తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌ కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కరువు మండలాలను ఇంతవరకు ప్రకటించక పోవడంతో రాష్ట్రానికి రావాల్సిన రూ. 230 కోట్ల రూపాయల సబ్సిడీ నిలిచిపోయిందని దత్తాత్రేయ తెలిపారు. అలాగే రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి అవగాహనగాని, వారి పట్ల సానుభూతిగాని లేదని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదని, అధికారుల ఇష్టాయిష్టాల ఆధారంగా సమాచారం అందుతుందని, వాస్తవంగా రైతుల బాధలు పట్టడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని, వరంగల్‌ ఉప ఎన్నికల్లో నెగ్గేందుకు ఇలాంట చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడడం మానేయాలని, ఇప్పటికైనా ఈ వైఖరిని విడనాడితే జనం నమ్ముతారని ఆయన అన్నారు.