కులమే మైనస్‌ అయిన వేళ!

పయ్యావుల కేశవ్. టీడీపీలో బాగా నోరున్న నేత. అలాని ఏదిపడితే అది కాకుండా మంచి సబ్జెక్ట్ మాట్లాడగలిగిన దిట్ట. అయితే ఎంత టాలెంట్ ఉంటే ఏం చేస్తాం. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచి ఉంటే మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. ఆయన ఓడిపోవడంతో ఆ చాన్స్ అదే సామాజికవర్గానికి చెందిన పరిటాల సునీత ఎగరేసుకుపోయారు.   ఇటీవల పయ్యావుల కేశవ్ సేవలు మెచ్చి చంద్రబాబు ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చారు. దీంతో మరోసారి పయ్యావుల పేరు మంత్రి పదవి రేసులోకి వచ్చింది. ఈసారి విస్తరణ జరిగితే పయ్యావులకు చాన్స్ ఇస్తారా లేదా అన్నదానిపై చర్చ మొదలైంది. అయితే పయ్యావుల సామాజికవర్గమే
ఆయనకు ఇప్పుడు పెద్ద మైనస్‌ అయి కూర్చుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎందుకంటే…
అనంతపురం జిల్లా నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన పరిటాల సునీత, రెడ్డి సామాజికవర్గానికి చెందిన పల్లె రఘునాథరెడ్డి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు పయ్యావులకు కూడా మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లా నుంచి ఇద్దరు కమ్మ నేతలకు మంత్రి పదవులు ఇచ్చినట్టు అవుతుంది. పైగా ఇప్పటికే కేబినెట్‌లో  కమ్మ సామాజికవర్గం(మొత్తం 20 మందిలో చంద్రబాబు, దేవినేని ఉమ, పరిటాల సునీత,ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్‌) వారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పయ్యావులకు మంత్రి పదవి ఎలా ఇస్తారు అన్న దానిపై చర్చ మొదలైంది. అంతేకాదు అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కూడా అగ్రకులాలకు చెందిన వారే. కాబట్టి విస్తరణ అంటూ జరిగితే  అనంత నుంచి మరొకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే బీసీ నేతకే అవకాశం  ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఇదే సమీకరణాన్ని పయ్యావుల వ్యతిరేకులు పదేపదే చంద్రబాబు వద్ద వినిపిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పయ్యావుల అవకాశాలను దెబ్బతీసేందుకు వైరివర్గం ప్రయత్నిస్తోందని ఆయన సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఒకవేళ పరిటాల సునీతను తప్పిస్తారా అంటే.  పరిటాల వర్గీయులను చంద్రబాబు దూరం చేసుకునే అవకాశాలు చాలా తక్కువంటున్నారు. పల్లెపైనా వేటేసి ఆ స్థానంలో భర్తీ చేస్తే రెడ్లి వ్యతిరేకి అన్న ముద్రను మరింత బలంగా వేయించుకున్న వారవుతారు చంద్రబాబు. ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇవ్వబోమని తప్పించుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మంత్రి నారాయణ ఎమ్మెల్సీ కోటాలోనే మంత్రి అయ్యారు.  మొత్తం మీద పయ్యావుల సామాజికవర్గమే ఇప్పుడాయనకు పెద్ద గుదిబండగా మారి  కూర్చుందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.