రాజీనామాలకు సిద్ధమైన టీడీపీ నేతలు

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా టీడీపీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక నాయకత్వం నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవుతోంది, ఆదినారాయణరెడ్డిని చేర్చుకోవద్దని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పార్టీ పెద్దలు లెక్కచేయకపోవడంతో జమ్మలమడుగు నియోజవకర్గంలో టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఆదినారాయణరెడ్డిని చేర్చుకుంటే తామంతా రాజీనామా చేస్తామని… వాటిని ఆమోదించిన తర్వాతే వైసీపీ ఎమ్మెల్యేను చేర్చుకోవాలని తేల్చిచెబుతున్నారు. నియోజకవర్గంలోని కొండాపురం, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు మండలనాయకులు బుధవారం వారి నిర్ణయాన్ని ప్రకటించారు. కొండాపురం మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణరెడ్డితో పాటు ఎంపీపీ అనురాధ, 16 మంది సర్పంచ్‌లు రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. ఆఫ్‌లైన్‌లో స్థానిక టీడీపీ నేతలు లోకేష్, మంత్రి గంటాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click to Read: ఏరి? ఎక్కడ… ఆ ఉత్తర కుమారులు?

ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం వెనుక లోకేష్, గంటా హస్తం ఉందని వారు భావిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి చేరికను మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి… చంద్రబాబు దగ్గర తీవ్రంగా వ్యతిరేకించడంతో సీఎం పునరాలోచనలో పడ్డారు. అయితే నాలుగు రోజుల క్రితం మంత్రి గంటా కడప జిల్లాకు వచ్చి మళ్లీ చేరికపై సంప్రదింపులు మొదలుపెట్టడడం రామసుబ్బారెడ్డి వర్గానికి రుచించడం లేదు. ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే జిల్లాలో వైసీపీ బలహీనపడుతుందన్నది లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు.

జమ్మలమడుగు టీడీపీ నేతలు మాత్రం ఇక్కడి రాజకీయాల గురించి లోకేష్, గంటాకు ఏం తెలుసని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రాణాలకు కూడా లెక్కచేయకుండా ఆదినారాయణపై తాము పోరాటం చేశామని… ఇప్పుడు తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రత్యర్థులను తమ నెత్తిన రుద్దడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నాయకత్వమే తమకు వెన్నుపోటు పొడుస్తోందని వారు ఆవేదన చెందుతున్నారు.

Click to Read: Jr NTR too falls for ‘multi-millionaire’