బెడిసికొట్టిన సింగపూర్ డీల్

రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్‌తో తొలివిడత డీల్ బెడిసికొట్టింది. సింగపూర్‌ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. సింగపూర్‌ పెట్టిన షరతులు చూసి సీఆర్‌డీఏ అధికారులు షాక్ అయ్యారు. నాలుగు వేల ఎకరాలపై జనరల్ పవరాఫ్ అటార్నీ ఇవ్వాలని… అలా ఇస్తే ఆ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి, రుణం తీసుకుని రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పి దిమ్మతిరిగేలా చేసింది సింగపూర్.

రాజధాని నిర్మాణంలో తన మూలధన పెట్టుబడి కేవలం రూ.300 కోట్లు మాత్రమేనని తేల్చిచెప్పింది. అంటే మన భూమిని స్వాధీనం చేసుకుని దాన్ని తాకట్టుపెట్టి ఆ సొమ్ముతోనే భవనాలు కట్టిస్తామన్నది సింగపూర్ ప్రతిపాదన. మరో కీలకమైన షరతును కూడా సింగపూర్ ఏపీ ముందుంచింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ ఉన్నప్పటికీ … రాజధాని నిర్మాణ పనులన్నీ తాను ఏర్పాటు చేసుకునే మరో సంస్థ ద్వారా చేపట్టేందుకు అంగీకరించాలని షరతు విధించింది. అంటే సీఆర్‌డీఏ, ఏపీ ప్రభుత్వం చేతులు కట్టుకుని జరుగుతున్న తంతును చూస్తూ ఊరుకోవాలన్న మాట. భూములిచ్చిన రైతులకు కేంద్ర రాజధాని ప్రాంతానికి(25 కి.మీ) వెలుపలే ఇవ్వాలని మరో కండిషన్ కూడా పెట్టింది. సమీకరణలో భూమి ఇచ్చిన రైతులకు వారి గ్రామాల పక్కనే అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది.

రాజధాని కేంద్ర ప్రాంతంలో తాము ఒక సంస్థను నెలకొల్పితే అలాంటి మరొక సంస్థను చుట్టూపక్కల 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయకూడదని చెప్పింది. ఈ కండిషన్లను చూసిన ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులకు దిమ్మతిరిగింది. సింగపూర్‌ వారు కేవలం రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టి ఏకంగా నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం ఏమిటి?. తిరిగి మన భూమినే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతోనే అభివృద్ధి చేయడం ఏమిటి?.సీఆర్‌డీఏ జోక్యం ఉండకూడదన్న నిబంధన ఏమిటి ?.రైతులకు భూములెక్కడ ఇవ్వాలన్నది సింగపూరే నిర్ణయించడం ఏమిటి? . అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధానా లేక సింగపూర్‌ సిటీనా?. సింగపూర్‌ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తిరస్కరించింది. మరో రకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరింది.