టీడీపీలోకి కొణతాల- దాడి దారెటు?

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణుడు టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. ఆయన ఉదయం చంద్రబాబును కలిశారు. కొణతాలతో పాటు గండి బాబ్జి కూడా సీఎంను కలిశారు. మంత్రి చింతకాయల అయన్నపాత్రుడు వీరిని సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. చాలా కాలం క్రితమే కొణతాల వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి గంటా వర్గం కొణతాల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది.

దాడి వీరభద్రరావును టీడీపీలోకి తీసుకురావాలన్నది గంటా వర్గం భావన. అయితే చివరకు అయన్నపాత్రుడు మాటే నెగ్గింది. సోమవారం జరిగిన టీడీఎల్పీ భేటీలోనూ పార్టీలోకి వలసలను ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించవద్దని నేతలకు చంద్రబాబు గట్టిగా చెప్పారు. అది జరిగిన మరుసటి రోజే చంద్రబాబును కొణతాల కలిశారు. అయితే ఇప్పుడు దాడి వీరభద్రరావు పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చ జరుగుతోంది. ఆయన కూడా ఎన్నికలు ముగిసిన వెంటనే వైసీపీకి రాజీనామా చేశారు. కొణతాలకు, దాడి వర్గానికి మధ్య పచ్చగట్టివేస్తే భగ్గుమనే పరిస్థితి. కాబట్టి కొణతాల టీడీపీలో చేరితే దాడి ఎటు వెళ్తారో చూడాలి.