సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు – రివ్యూ

చిత్రం పేరు-సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు

రేటింగ్‌. 3/5
విడుదల తేదీ : 29 జనవరి  2016

క్రికెట్ అనే పదం మన రక్తంలో ఇంకిపోయింది. అందుకే క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు పెద్ద హీరోలు కూడా తమ సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడుతారు. క్రికెట్ తరువాత మన దేశంలో ఎక్కువ పాపులారిటీ సినిమాలకే. మరి సినిమాలోనే క్రికెట్ ఉంటే అది లగాన్. ఈ సినిమా తర్వాత స్పోర్ట్స్‌ కథాంశాలుగా చక్‌ దే ఇండియా, బాగ్‌ మిల్కాబాగ్ ఇలా చాలా వచ్చాయి. తెలుగులో ”కబడ్డీకబడ్డీ”, ”సై”, ”గోల్కండ హైస్కూల్‌” వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ”సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చింది. అది కూడా సెకెండాఫ్‌లో చివరి 30 నిమిషాల్లో మాత్రమే.

మామూలుగా ఫస్టాప్‌ బాగా తీసి సెకెండాఫ్‌లో చేతులెత్తేస్తారు. దర్శకుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి ఫస్టాఫ్‌ నత్తనడక చేసి సెకెండాఫ్‌లో స్పీడ్‌ పెంచాడు. ఇది ప్లస్సయింది. అన్నిటికంటే హాయిగా అనిపించేది ఏమంటే సినిమా మొత్తం పల్లెటూరిలో నడుస్తుంది. పచ్చనిపొలాలు, కాలువ గట్లు అందంగా కనిపిస్తాయి. కథ కూడా పల్లెటూరి అమాయకపు ప్రేమకథ.

బిగినింగ్‌లో రాజ్ తరుణ్‌ వాయిస్‌ ఓవర్ వినిపిస్తుంది. ఒక అతిపెద్ద ఆటగాడితో, ఆటరాని నేను పోటీపడుతున్నానని అంటాడు. దీంతో ఈ కథ క్రికెట్‌కి సంబంధించిందని అర్థమవుతుంది. ఆ తర్వాత సీతామాలక్ష్మి పరిచయంతో చైల్డ్‌ హుడ్ లవ్ స్టోరీ మొదలవుతుంది. కట్‌ చేస్తే హీరోయిన్ పట్నంలో డాక్టర్‌ చదువుతూ ఉంటుంది. హీరో పల్లెటూళ్లో బేవార్స్ బ్యాచ్‌తో తిరిగేవాడు. వీళ్లిద్దరికి ఎలా కుదురుతుందనేదే సినిమా.

అమ్మాయి ప్రేమ కోసం మనవాడు ఏమైనా చేస్తాడు. గోరింటాకు చెట్టునే ఒక్క ఆకు కూడా ఖాళీ లేకుండా పీకేస్తాడు. నిప్పుల్లో నడుస్తాడు. కూతురికి ఇష్టం లేని సంబంధం తండ్రి కుదురుస్తాడు. అతను అతి పెద్ద క్రికెట్ ఆటగాడు. ఈ పెళ్లిని చెడగొట్టడానికి హీరో వెళితే తనతో క్రికెట్ ఆడి గెలవమంటాడు. ఆట రాని పల్లెటూరివాళ్లు ఆట వచ్చిన క్రీడాకారుల్ని ఎలా ఎదుర్కొన్నారో అదే సినిమా.

దర్శకుడు శ్రీనివాస్ కొన్ని సన్నివేశాల్ని ఎంత మెచ్యురిటీతో తీశాడో.. మరికొన్నింటిని అంత పేలవంగా తీశాడు. ఫస్టాప్‌లో చాలా సీన్స్‌ బోరు కొడతాయి. షకలక శంకర్ పంచ్‌లు వేసి సినిమా పడిపోతున్న ప్రతిసారి పైకి లేపాడు. రాజ్‌తరణ్‌ బాడీ లాంగ్వేజ్‌లోనే ఈజ్ ఉంది. ఇలాంటి పాత్రలు సహజంగా చేసేస్తాడు. అయితే అతని ప్రతి సినిమాలోనూ ఇదే విధంగా ఉంటే కొంతకాలానికి దెబ్బతింటాడు. హీరోయిన్ అర్చన అందంగా ఉంది. నటించడానికి బోలెడంత అవకాశం ఉన్నా దర్శకుడు ఉపయోగించుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ లవ్‌కి ఛాన్స్ ఉన్నా అనవసరమైన సోది సీన్స్, మసలాళ్ల సీన్స్‌ పెట్టి ఫిల్మ్ వేస్ట్ చేశాడు. సినిమాని ఇంకొంచెం ట్రిమ్ చేసుంటే బావుండేది.

పాటలు బాగున్నాయి. పల్లెటూరి దృశ్యాలను అందించడంలో కెమెరా ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉండాలి. డైలాగ్స్‌ చాలా చోట్ల బాగున్నాయి. దర్శకుడి శ్రద్ధ తెలుస్తూనే ఉంటుంది కానీ ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాలి. యూత్‌కి ఈ సినిమా ఎక్కితే రాజ్ తరుణ్‌కి మరే హిట్ దక్కినట్టే. ఒక వేళ ఎక్కకపోయినా పర్లేదు. ఈ సినిమాతో ఎవరూ నష్టపోరు, డబ్బు పెట్టిన ప్రేక్షకుడితో సహా.
                                                                                                                                                                                                                                                          …. జీఆర్‌. మహర్శి

Click on Image to Read

trisha-devil
Amrutha-Fadnavis-Singer
samantha-ntr
Bahubali-Anushka
Victory-Venkatesh