ఆ ప్రేమ‌క‌థ‌…ఆసుప‌త్రికి, పోలీస్ స్టేష‌న్‌కి చేరింది!

పెళ్లికి అంగీక‌రించ‌లేద‌నే కోపంతో ప్రేమించిన యువ‌తిని న‌డిరోడ్డుమీద దారుణంగా క‌త్తితో పొడిచాడు ఓ ప్రేమోన్మాది. హైద‌రాబాద్‌, బోయిన‌ప‌ల్లి ఇక్రిశాట్ కాల‌నీలో ఈ దారుణం జ‌రిగింది. ఓల్డ్ బోయిన‌ప‌ల్లికి చెందిన సుజాత(22) టెలీకాల‌ర్‌గా ప‌నిచేస్తోంది. అంత‌కుముందు ఆమె క్వాలిటీ సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేసేది. అక్క‌డ ఆమెకు శ్ర‌వ‌ణ్ కుమార్ ప‌రిచ‌యం అయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌ని కూడా అనుకున్నారు. అయితే సుజాత త‌ల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆమె అదే విష‌యాన్ని శ్ర‌వ‌ణ్‌కి చెప్పింది. త‌న‌కు త‌న బావ‌తో వివాహం కుదిరింద‌ని, త‌న‌ను మ‌ర్చిపొమ్మ‌ని కోరింది. ఆమె సూప‌ర్ మార్కెట్లో  ఉద్యోగం మానేసి వేరే చోట టెలికాల‌ర్‌గా చేరింది. ఈ నేప‌థ్యంలో శ్ర‌వ‌ణ్ కూడా అక్క‌డ మానేసి సికింద్రాబాద్‌లో కొరియ‌ర్ బాయ్‌గా చేస్తున్నాడు.

అయితే అత‌ను సుజాత కోరిన‌ట్టుగా ఆమెను మ‌ర్చిపోలేదు. ఆమె వెంట‌బ‌డి పెళ్లి చేసుకుందామ‌ని వేధించ‌డం మొద‌లుపెట్టాడు. సుజాత ఈ విష‌యాన్ని ఇంట్లో చెప్ప‌డంతో ఆమె అన్న,  శ్ర‌వ‌ణ్‌కి వార్నింగ్ ఇచ్చాడు. అయినా అత‌ను మాన‌లేదు. సుజాత‌తో ఫోన్లో మాట్లాడాల‌ని ప్ర‌య‌త్నించాడు. అదీ కుద‌ర‌క‌పోవ‌డంతో ఉన్మాదిగా మారాడు. సుజాత‌ని చంపి తాను చ‌నిపోవాల‌ని నిర్ణయించుకున్నాడు. ఈ క్ర‌మంలో ఆఫీస్‌కి న‌డిచివెళుతున్న సుజాత‌ని అడ్డ‌గించి న‌డిరోడ్డుమీద క‌త్తితో పొత్తిక‌డుపులో పొడిచాడు. దాంతో ఆమె కుప్ప‌కూలిపోయింది. రెండు క‌త్తుల‌తో అక్క‌డికి వ‌చ్చిన శ్ర‌వ‌ణ్, త‌న‌ను తాను పొడుచుకోవాల‌ని అనుకున్నాడు. కానీ జ‌నం గుమిగూడ‌టంతో అక్క‌డినుండి పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు. వైద్యం పొందుతున్న సుజాత ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. బాధితురాలి సోద‌రుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.