జేఎన్‌యూ ఘటనలపై పాలగుమ్మి సాయినాథ్‌ ప్రసంగం

(ప్రముఖ పాత్రికేయులు, వ్యవసాయరంగ నిపుణులు, ‘రామన్‌ మెగసెసే’ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌ జేఎన్‌యూ ఉద్యమానికి మద్దతుగా గత 19న విద్యార్థులనుద్దేశించి క్యాంపస్‌లో ప్రసంగించారు. ఆ ప్రసంగానికి పూర్తిపాఠం ఇది.)

నేను జేఎన్‌యూ పూర్వ విద్యార్థిని కావడం నాకు గర్వకారణం. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన కొద్ది కాలానికే నేనీ క్యాంపస్‌లో అడుగుపెట్టాను. ఆ రోజుల్లో పురుషుల ‘గంగా’ హాస్టల్‌ రాజకీయంగా ఎక్కువ క్రియాశీలంగా ఉండేది. నేనందులోనే ఉండేవాణ్ని. మీలాగే మమ్మల్నీ బాగా ద్వేషించారు. బహుశా మేం అందులోంచి బైటికి వెళ్లాక ‘హౌమం’ జరిపి ఉంటారు. ఆ తర్వాత దాన్ని మహిళల హాస్టల్‌గా మార్చారు. బహుశా మహిళలైతే ‘బుద్ధిగా’ ఉంటారని భావించి ఉంటారు. కానీ మీరేమైనా ‘బుద్ధిగా’ వ్యవహరించారా? (‘లేదు’ – విద్యార్థినుల జవాబు) నేనూ అదే ఆశించాను!

దాదాపు 25-30 ఏండ్ల తర్వాత నేను ఈ క్యాంపస్‌కు మళ్లీ వచ్చాను. జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) సభ్యుడిగా ఐదేండ్లు పని చేశాను. అయితే నాకు మాత్రం నేను విద్యార్థిగా, విద్యార్థి సంఘం నేతగా, గంగా హాస్టల్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలమే గొప్పగా అనిపిస్తుంది. నేను ఈసీగా కొనసాగిన ఐదేండ్ల కాలంలో 80 శాతం సమయం కేవలం ఒక్క అంశంపై అడ్మినిస్ట్రేషన్‌తో పోరాడడంలోనే ఖర్చయ్యింది. ఎందుకంటే ఒక శక్తిమంతమైన సమూహం ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు లేకుండా చేయాలనే ప్రయత్నాల్లో ఉండింది. సుప్రీంకోర్టు తీర్పు, పార్లమెంటు ఆమోదించిన చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్లు వ్యతిరేకించారు, వక్రీకరించారు. అయితే అందులో వాళ్లు సఫలం కాలేదనుకోండి.

నేనిక్కడికి మీ కోసం మాత్రమే వచ్చాను. నాకు ఢిల్లీలో వ్యక్తిగతంగా మరో పనేదీ లేదు. మీరు మీ స్వంత డిమాండ్లను మించిన పెద్ద సమస్యలపై కోసం పోరాడుతున్నారు. ఈ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలను ఒక క్రమంలో పేర్చితే మీరు పోరాడుతున్న సమస్య టాప్‌ 3లో నిలుస్తుంది. ఈ ప్రక్రియలు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మక క్యాంపస్‌లలోకి కూడా ప్రవేశించాయి. అసమ్మతిని నేరమయం చేయడానికి వ్యతిరేకంగా మీరు పోరాడుతున్నారు. అంటే అసమ్మతిని ప్రకటించినందుకు మిమ్మల్ని నేరస్థులుగా చేయడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. నేడు మీరు జీవిస్తున్నది భారీ అంతరాలున్న సమాజంలో. అంతేకాదు, కార్పొరేట్‌ అధికారతంత్రం సంయమనాన్ని పూర్తిగా కోల్పోయిన దశలో మీరు జీవిస్తున్నారు. దీన్ని అంతటా చూడొచ్చు.

ఒడిషాలోని కళింగనగర్‌లో విద్యావంతులైన ఆదివాసీ దంపతులు, తమ జీవిత కాలంలో ఎన్నడూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లని వారు, టాటాకు తమ భూముల్ని ఇవ్వడానికి వ్యతిరేకించారు. దాంతో వాళ్లిద్దరిపై 91 కేసులు నమోదయ్యాయి. అదే రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్‌లో పోస్కో వ్యతిరేక ఉద్యమ నేత అభరు సాహుతో నేనెప్పుడు మాట్లాడినా ప్రతి సారీ అతనిపై ఉన్న కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చివరిసారి అడిగినప్పుడు 57 కేసులు ఉన్నాయని చెప్పాడు. వారి సంస్థకు పోస్కోతో పోరాడి ఓడించిన చరిత్ర ఉంది. ఇప్పుడా ప్రాంత ప్రజలు గ్రామం నుంచి బైటకు వెళ్లలేకపోతున్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారని భయం. చాలా మంది తమ సన్నిహితుల వివాహాలను కూడా వదిలేసుకున్నారు. ప్రతి చోటా ఇదే పరిస్థితి! నవీ ముంబైలో రిలయెన్స్‌ ఎస్‌ఈజెడ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కూడా ఎంత మందిపై ఎన్ని కేసులు పెట్టారని?! కోరాపుట్‌లోనైతే ఒక కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ జైలు పాలయ్యాడు. ఆ ప్రాంతాల్లో పోలీసుస్టేషన్‌కు ర్యాలీలు జరుగడం సాధారణం. ఓసారి అక్కడ ఘర్షణ జరిగింది. పోలీసులు కేసులు పెట్టారు. ఒకరిద్దరి పేర్లతో పాటు, 800 ఇతరులపై కేసులు పెట్టారు! దీని ద్వారా వాళ్లకు ఆ తర్వాతి మూడేండ్లలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దాడులు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ప్రజలను వేధించే వీలు కలుగుతుంది.

ఎట్లాగూ పేర్లు లేవు కాబట్టి ఆ సాకుతో ఎవరినైనా వేధించవచ్చు. అట్లా ఆ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ ఇరుక్కుపోయాడు. ఆయనపై పెట్టిన ఆరోపణలు కూడా చాలా అమోఘమైనవి! బర్రెను దొంగిలించాడనేది ఒక ఆరోపణ! కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ మిగతా పశువుల్లో గేదెను గుర్తించగలడో లేదో కూడా తెలియదు. ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి వింత, వింత కేసుల్ని చాలా చూశాం. శ్రీకాకుళంలో రేవు నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో 80 ఏండ్ల వయస్సున్న ఒక మహిళపై 23 కేసులున్నాయి. వాటిలో ఒకటి పోలీసులపై హత్యా ప్రయత్నం! బక్కపలుచగా, నాలుగడుగుల ఎత్తు ఉన్న ఆ వృద్ధురాలి బరువు అతి కష్టంగా 35 కిలోలుండొచ్చు. ఒక బృందంగా వచ్చిన 20-30 మంది పోలీసులను చంపడానికి ఆమె ప్రయత్నించిందట! కాబట్టి మీరు జేఎన్‌యూలో ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు.

ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో పరిస్థితులు మెరుగవుతాయి. కానీ మెరుగవడానికి ముందు చాలా దుర్భరంగా తయారవుతాయి. మెరుగుపడడం అనేది మనం ఈ దుర్భర పరిస్థితులను ఎలా ఎదుర్కొంటామన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. నాకు జేఎన్‌యూ విద్యార్థులపై అంతులేని విశ్వాసం ఉంది. మీరు నిలిచి పోరాడగలుగుతారు. నేను మీతో నిలబడి ఉన్నానని చెప్పడానికే ఇక్కడికొచ్చాను. నాకు తెలుసు.. మీరు భయపడరు. పోరాటం ఆపెయ్యరు. గెలుస్తారు. మీరిప్పుడు దేశంలో అసమానతలు అత్యధిక స్థాయిలోకొనసాగుతున్న సమయంలో జీవిస్తున్నారు. అట్లాగే, మతతత్వం పెచ్చరిల్లి పోతున్న కాలం కూడా ఇది. ఈ రెండూ ఒకదానితో ఒకటి జతకట్టాయి. దేశాన్ని నేడు సామాజిక మత ఛాందసవాదుల, ఆర్థిక మార్కెట్‌ ఛాందసవాదుల కూటమి పాలిస్తోంది. వీళ్లిద్దరికీ పరస్పర అవసరం చాలా ఉంది. అందుకే వాళ్లు సమైక్యంగా ఉన్నారు. చాలా మందిలో ఈ రెండు అంశాలు కలిసే ఉంటాయి. ఏకకాలంలో వారు ఆర్థిక మార్కెట్‌ ఛాందసవాదులు, అదే సమయంలో మత ఛాందసవాదులు కూడా. మతతత్వవాదులలాగే మార్కెట్‌ ఛాందసవాదులకు కూడా పండితులు, ప్రవక్తలు, పురాణాలు వగైరా అన్నీ ఉంటాయి. మార్కెట్‌ ఛాందసవాదుల ప్రచారం ప్రతి రోజూ ప్రతి ఛానెల్‌లో జరుగు తుంది. వృద్ధి, అవకాశాలు వంటి చిలక పలుకులు పలికే ప్రవక్తలుంటారు. అసమానతలు పెద్ద సమస్యేమీ కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వివిక్‌ దేబ్‌రారు అంటున్నారు. దీనిపై తమిళనాడులోని నా మిత్రులు ‘నీతి అయ్యో’ అని వాపోతున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలను పోలుస్తూ, అరుణ్‌ శౌరీ బీజేపీని కాంగ్రెస్‌ ప్లస్‌ ఆవు అని అన్నారు. నేనిప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తున్నాను. అక్కడ బీఫ్‌పై నిషేధం ఉంది. ఆవు పవిత్రతను కాపాడడమనేది మతతత్వవాదుల భావన. వ్యవసాయ కేంద్రిత ఆర్థికవ్యవస్థల్లో ఆవుకు కేంద్ర స్థానం ఉందనడంలో సందేహం లేదు. ఆవుల వధపై నిషేధాన్ని ఇప్పుడు ఎద్దులకు, మిగతా పశువులకు విస్తరించారు. దేశ జనాభా సంపుటిని గమనిస్తే, భావజాలపరంగా, మతపరంగా 42 శాతం మందికి బీఫ్‌తో ఏ సమస్యా లేదు. వారే గాకుండా ఇంకా చాలా మంది బీఫ్‌ తింటారు. ఉదాహరణకు కేరళలోనైతే అందరూ బీఫ్‌ తింటారు. ఇటీవల ఒక బీజేపీ నాయకుడు బీఫ్‌ తింటున్న వీడియో ఇంటర్నెట్‌పై వైరల్‌ అయ్యింది. అయితే దాన్ని సమర్థించుకుంటూ, అది మూడేండ్ల క్రితందని, ఇప్పుడు తాను బీఫ్‌ మానేశానని ఆయన చెప్పుకున్నాడు. ఇంకో సమర్థన ఇలా సాగింది.. అది బీఫ్‌ కాదు, వేయించిన ఉల్లిగడ్డ ఆలుగడ్డలు అని!

సరే, ఇక బీఫ్‌ నిషేధం తర్వాతి పరిణామాలేమిటో చూడండి. ముంబయిలోని జీజామాత జూలో పులులకు, సింహాలకు చికెన్‌ పెట్టసాగారు. బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ వాళ్లు ఎక్కడికక్కడే వాహనాలను అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మహారాష్ట్రలోని పశువుల మార్కెట్లన్నీ దెబ్బతిన్నాయి. అన్ని మతాల, సముదాయాల వాళ్లు – హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అందరూ చాలా ఇబ్బందులకు గురయ్యారు. వ్యవసాయంపై, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులపై ఎలాంటి అవగాహన లేని మధ్యతరగతి మేధావుల గుంపునొకటి తయారు చేసుకున్నారు వాళ్లు. వాళ్లకు గ్రామీణ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన ఓనమాలు కూడా తెలియవు. పశువుల పాత్రేమిటో తెలియదు. ఈ మధ్య ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఓ మంచి కథనం ప్రచురించింది.

కొల్హాపూర్‌ చెప్పుల పరిశ్రమ ఎలా దెబ్బతిన్నదో వివరించింది. ఇది మేక్‌ ఇన్‌ ఇండియానా, బ్రేక్‌ ఇన్‌ ఇండియానా!? కొల్హాపూర్‌ చెప్పుల పరిశ్రమ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్‌. ఉదారవాద విధానాలేవీ మొదలు గాక ముందు ప్రపంచంలోనే ఇదొక ముఖ్య ఎగు మతుల పరిశ్రమగా ఉండింది. ఇప్పుడు నిషేధాన్ని విస్తరింపజెయ్యడంతో ఈ పరిశ్రమ కుప్పగూలింది. ఈ పరిశ్ర మలో ఉన్నది ముస్లింలు కాదు, దళితులు! మరాఠాలు వంటి ఓబీసీ కులాలు కూడా పశువుల మార్కెట్‌లో ముఖ్య పాత్ర పోషించేవారు. వాళ్లూ నష్టపోయారు. బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ వంటి సంస్థలూ, తామూ ఒకటి కాదని ఆర్‌ఎస్‌ఎస్‌/బీజేపీ వాళ్లంటారు. లెఫ్ట్‌ వాళ్లేమో వాళ్లంతా ఒకటేనని ఆరోపిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం వాళ్లు వేర్వేరు! ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి. బీజేపీ అంటే రాజకీ యాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌! వీహెచ్‌పీ అనేది స్టెరాయిడ్లు తీసుకున్న బీజేపీ! బజరంగ్‌ దళ్‌ అంటే వెర్రెత్తిన వీహెచ్‌పీ! కాబట్టి నిజంగానే ఈ తేడాలున్నాయి. గుర్తించండి.

ఇప్పటి భారతదేశానికీ, కొద్ది దశాబ్దాల కిందటి భారతదేశానికీ మధ్య ఒక పెద్ద తేడా ఉంది. తేడాలు చాలానే ఉన్నాయి కానీ ఇది ముఖ్యమైంది. దేశంలో మొదటిసారి ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ మెజారిటీతో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇదివరలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ 40 ఏండ్ల క్రితం నాటి ప్రచారక్‌. ఆయనది మైనారిటీ ప్రభుత్వం కూడా. కాబట్టి అతను చేయగల పనులకు చాలా పరిమితులుండేవి. ఆయన అనేక మార్లు సంకీర్ణ ధర్మం గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు ప్రచారక్‌ మెజారిటీతో ఉన్నాడు కాబట్టి వాళ్లకు తమను తాము పూర్తిగా ప్రకటించుకునే అవకాశం కలిగింది. వాళ్లిప్పుడు అదే పని చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.

ఇక మనం నివసిస్తున్నది అవిశ్వసనీయమైన అసమానతలున్న దేశంలో. కానీ నీతి ఆయోగ్‌ వాళ్లు, ఆర్థికవేత్తలు దాన్నొక సమస్యగానే చూడడం లేదు. మార్కెట్లు దేశాన్ని సరళీకరించేేశాయి. కొద్దిగా అసమానత ఉంది అని వాళ్లంటారు. ఇది ‘కొద్దిగా గర్భవతి’ కావడం లాంటి మాటని నేనోసారి వాళ్లతో అన్నాను!

గత 24 నెలలలో 4-5 రకాల గణాంకాలు బైటికి వచ్చాయి. 2011 జనాభా లెక్కలకు కొనసాగింపుగా వచ్చిన ఎస్‌ఈసీసీ (సామాజిక, ఆర్థిక కుల జనగణన) గణాంకాలను (వీటిలో కులం వివరాలు మాత్రం ఇవ్వలేదు) చూద్దాం. ఎస్‌ఈసీసీ ప్రకారం గ్రామీణ జనాభా ఇప్పుడు 88.4 కోట్లు. జనాభా లెక్కల ప్రకారం ఇది 83.3 కోట్లు ఉండింది. 75 శాతం గ్రామీణ కుటుంబాల్లో ప్రధాన సంపాదనాపరుడి ఆదాయం రూ. 5 వేల కన్నా తక్కువ. ఈ పరిమితిని రూ. 10 వేలకు చేర్చితే 90 శాతం గ్రామీణ కుటుంబాల ప్రధాన సంపాదనాపరులు అందులో చేరుతారు. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం 100 మంది శతకోటి డాలర్ల (రూ. 6,85,334.5 కోట్లు గల) కుబేరులు జీడీపీలో 12 శాతంతో సమానంగా సంపద కలిగి ఉన్నారు.

డాలర్‌ బిలియనీర్లలో ఐదో స్థానంలో ఉన్న మన దేశం యూఎన్‌ మానవ అభివృద్ధి సూచీలో మాత్రం 135వ స్థానంలో అఘోరిస్తున్నది. బొలీవియా సహా లాటిన్‌ అమెరికా దేశాలన్నీ మనకన్నా పైన ఉన్నాయి. ఈ సూచీలో మనకన్నా కింద ఉన్న ఏకైక కరేబియన్‌ దేశం హైతీ. 30 ఏండ్ల పాటు అంతర్యుద్ధం సాగించిన శ్రీలంక మనకన్నా 20 స్థానాలు ముందున్నది. అత్యంత క్రూరమైన యుద్ధాలకు వేదికగా ఉన్న వియత్నాం మన దేశంతో పోలిస్తే 50 స్థానాలకన్నా ముందుంది. అమెరికా సామ్రాజ్యవాదులు ప్రయోగించిన ఏజెంట్‌ ఆరెంజ్‌, తదితర విష రసాయనాల కారణంగా కొన్ని తరాలే దుష్ప్రభావాలను చవి చూసిన దేశం అది. ఈ దేశాలన్నీ మనకన్నా ముందున్నాయి. కానీ ఈ దేశాల్లో మన లాగా డాలర్‌ బిలియనీర్లు లేరు. నార్డిక్‌, స్కాండినేవియన్‌ దేశాలలో ఉన్న మొత్తం డాలర్‌ బిలియనీర్లకన్నా భారత్‌లో రెండున్నర రెట్లు ఎక్కువున్నారు. చైనాలో మనకన్నా ఎక్కువ మంది డాలర్‌ బిలియనీర్లు ఉండొచ్చు. రష్యానైతే నేనెప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ప్రతి ఐదేండ్లకోసారి వాళ్లు బిలియనీర్లందరినీ జైలుకు పంపిస్తారు. మన దేశంలోనేమో వాళ్లను పార్లమెంటుకు పంపిస్తాం! ఎంతైనా మనది పరిపక్వమైన ప్రజాస్వామ్యం కదా!!

పార్లమెంటులో అసమానత్వం గురించి కూడా కొంచెం చెప్పుకుందాం. 2014 ఎన్నికల అఫిడవిట్లలో మన ఎంపీలు స్వయంగా ప్రకటించిన ఆస్తుల వివరాల ప్రకారం 82 శాతం మంది కోటీశ్వరులు. 2004లో 32 శాతం ఎంపీలు కోటీశ్వరులు. 2009లో 53 శాతం ఎంపీలు కోటీశ్వరులు. దీనితో ఆదాయపన్ను రిటర్న్స్‌ జతచేయడం అనివార్యమేమీ కాదు కాబట్టి ఎంతైనా ప్రకటించవచ్చు. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ఎంత వినయం ప్రదర్శించారో చూడండి. 2014లో అతని ఆస్తులు 2004 నాటికన్నా తక్కువ. నిస్వార్థమైన జీవితమంటే ఇదే! ఆయన భవనాన్ని అప్పటి మార్కెట్‌ విలువతో వేశారని చెప్పారు. చూడండి మార్కెట్‌ మనకు ఎలాంటి అవకాశాల్నిస్తుందో! ప్రపంచంలో వంద కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి మాత్రం కడుపు నిండా తినే అవకాశం కూడా లేదు! ఎన్‌ఎస్‌ఎస్‌ (జాతీయ నమూనా సర్వే) 2013 డాటా ప్రకారం గ్రామీణ ప్రాంతంలో సగటున ఐదుగురు సభ్యులున్న రైతాంగ కుటుంబం ఆదాయం నెలకు రూ. 6,426. ప్రస్తుత విలువ ప్రకారం 97 అమెరికా డాలర్లు! ఈ లెక్కలు కేరళ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాలన్నింటి సగటుగా గుర్తుంచుకోవాలి. దీని ద్వారా గ్రామీణ జన జీవనం ఎంత ఘోరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ మరోవైపు, 1991లో ఒక్క డాలర్‌ బిలియనీర్‌ కూడా లేని దేశంలో 2015 నాటికి 100 మంది శతకోటి డాలర్ల కుబేరులు అవతరించారు!

నేను ‘పీపుల్స్‌ ఆర్కైవ్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా’ అనే కార్యక్రమం నడిపిస్తాను. నిజానికి మనం చాలా గొప్ప దేశాన్ని నాశనం చేస్తున్నాం. ఇక్కడ కొన్ని ఘోరాతి ఘోరమైన సంప్రదాయాలున్నాయి. మరికొన్ని అత్యద్భుతమైన అంశాలున్నాయి. ఇవి రెండూ కలిస్తేనే భారతదేశం! 83.3 కోట్ల మంది ప్రజలు 780 సజీవ భాషలను మాట్లాడుతారు. వాటిలో 6 భాషలను 5 కోట్లకన్నా ఎక్కువ మంది మాట్లాడుతారు. 3 భాషలను 8 కోట్లకన్నా ఎక్కువ మంది మాట్లాడుతారు. ఒక భాషను 60 కోట్ల మందికన్నా ఎక్కువ మంది మాట్లాడుతారు. ఒక భాషను 1 శాతం మంది మాట్లాడుతారు. (అండమాన్స్‌లో జారవా) ఒక భాషను ఏడుగురు (త్రిపురలో సైమార్‌) మాత్రమే మాట్లాడుతారు. ఇలా ఇదొక గొప్ప వైవిధ్యం గల సమాజం! దీనిని పోలినది ఈ భూతలంలో మరొకటి లేదు. కానీ వైవిధ్యంతో భయపడే వాళ్లు దాపురించారు మనకు. అందుకే వాళ్లు ఒక భాషను అందరిపై రుద్దాలని చూస్తున్నారు… హిందీని భాష అని చెబుతారు. ఉత్తరాదిలోని భోజ్‌పురీ, మిథిలా, బ్రిజ్‌భాష, అవధి వంటి మిగతా గొప్ప భాషలను మాత్రం మాండలికాలుగా వ్యవహరిస్తారు. హిందీకి నిండా 200 ఏండ్ల చరిత్ర కూడా లేదు.

ఉత్తర భారతంలో గొప్ప సాహిత్యానికి నెలవుగా ఉన్నవి అవధి, భోజ్‌పురీ, మిథిలి, బ్రిజ్‌భాషలు. ఉత్తరాదిలో ఇవే ప్రాచీన భాషలు. వాటిని గౌరవించండి. కానీ రెండు వైపులా ఉన్న మతతత్వవాదులు భాషలను మళ్లీ కనుగొనే క్రమంలో స్థానిక పదాలన్నీ తొలగించారు. ఉర్దూలో పర్షియన్‌ పదాలను ఎక్కువగా జొప్పించారు. హిందుస్తానీలోంచి ఉర్దూ, పర్షియన్‌ పదాలను తీసేసి హిందీని తయారు చేశారు. ఈ క్రమం ఒక వందేండ్లు సాగింది. 1960లలో నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు ఢిల్లీ ఆకాశవాణి గురించి ఒక జోక్‌ ఉండేది. ఏఐఆర్‌ ఎవరూ మాట్లాడని మూడు భాషలలో ప్రసారాలు చేస్తుందని అనేవారు! కులీనుల ఇంగ్లీష్‌, పర్షియనీకరించిన ఉర్దూ, సంస్కృతీకరించిన హిందీ!

మతతత్వవాదులకు వైవిధ్యం అంటే భయం. నాగాల్యాండ్‌, త్రిపుర వంటి ప్రాంతాల ప్రజలు వారికి తెలియని భాష మాట్లాడితే వాళ్లు భయపడతారు. నాకు మాత్రం ఇది గొప్పగా అనిపిస్తుంది! నేనిక్కడ గంగా హాస్టల్‌లో ఉన్నప్పుడు మన మధ్య 24 భాషలున్నట్టుగా నేను లెక్కించాను. అవన్నీ జేఎన్‌యూలో భాగం! మన పరిధులను దాటేసి జీవించడానికుండే ప్రాముఖ్యతేమిటో నేనీ క్యాంపస్‌లో నేర్చుకున్నాను! కెరియర్‌ అంటే ‘రెజ్యూమే’ (బయోడేటా) కాదని, విజయం అంటే స్ప్రెడ్‌షీడ్‌ కాదని నేర్చుకున్నాను. ఇక్కడి మిత్రులతో, కామ్రేడ్స్‌తో, వారు చేసే పోరాటాలతో చాలా నేర్చుకున్నాను. అవే నన్ను తీర్చిదిద్దాయి. ఇప్పుడు అసమానత్వం ఏ స్థాయికి చేరుకుందంటే తప్పుడు కారణాలు చూపిస్తూ ఎవరినైనా కూడగట్టడం, ఉద్యమాల్లోకి దించడం చాలా సులువు. ‘ఈయన నా ఉద్యోగం లాక్కున్నాడు, ఆయన నీ ఉద్యోగం లాక్కున్నాడు’ అని తేలిగ్గా గొడవలు సృష్టించవచ్చు. అసలు విషయం ఏమిటంటే, వాస్తవానికి ఉద్యోగాలే లేవు! వాళ్లు కోట్ల మందిని నిర్వాసితుల్ని చేశారు గానీ ఒక్క ఉద్యోగం కూడా సృష్టించలేదు. ముంబయిలో లౌకికవాదానికి పట్టుగొమ్మగా నిలిచిన బలమైన కార్మికవర్గం ఉండేది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భిన్న జాతుల కార్మికవర్గం! కానీ ఇప్పుడా మిల్లులేవి? ఇప్పుడంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే!

40 ఏండ్ల క్రితం రాయగఢ్‌, రత్నగిరి జిల్లాలను వదిలేసి వచ్చిన రైతులు, కూలీలు ముంబయి మిల్లుల్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తమిళులు, మలయాళీలు, మరాఠాలు అందరూ కలిసి పని చేశారు. ఆ వ్యక్తులు ఇప్పుడు ముంబయిలో ఇంటి పనివారుగా మారిపోయారు. ముంబయిలో మా ఇంట్లో పని చేసే మహిళది థాలేగాం నుంచి వచ్చిన రైతు కుటుంబం. థాలేగాం మహిళా, నేనూ 1980వ దశకంలో దాదాపు ఒకే సమయంలో ముంబయికి వచ్చాం. నయా ఉదారవాదం ఎలా పని చేస్తుందో చూడండి! ఆమె జీవితావసరాల ధరలన్నీ పెరుగుతూ పోయాయి. నాకు జీవితంలో ముఖ్యమైన వస్తువుల ధరలు మాత్రం తగ్గుతూ పోయాయి. కంప్యూటర్ల ధరలు, కార్ల ధరలు తగ్గాయి. ఎయిర్‌ కండిషనర్స్‌ చౌకగా మారాయి. కానీ బస్సు కిరాయిలు పెరిగాయి. ఆమె ముంబయికి వచ్చినప్పుడు కనీస చార్జీ 25 పైసలుండేది. కానీ ఇప్పుడు 5-8 రూపాయలు కనీస దూరానికి కిరాయిగా ఉంది. ఉన్నత, ఎగువ మధ్య తరగతికి అవసరమైన వస్తువులు చౌకగా మారాయి.

1991లో నేను మొట్టమొదటి కంప్యూటర్‌ కొన్నాను. అప్పుడు 20 ఎంబీల హార్డ్‌ డిస్క్‌ ఉండేది. ఇప్పుడు మనం వాడే మొబైల్‌ ఫోన్లు ఆనాటి కంప్యూటర్ల కన్నా 200-250 రెట్లు శక్తిమంతంగా తయారయ్యాయి. ప్రతి ఒక్కటీ సంపన్న, ఎగువ మధ్య తరగతి వాళ్లకు అనుకూలంగానే జరుగుతోంది. మరోవైపు గ్రామీణ భారతంలో 90 శాతం కుటుంబాల్లో ప్రధాన సంపాదనాపరుడి ఆదాయం రూ. 10 వేలకు మించలేదు. ఇది ఏ రకమైన అసమానత్వమో చూడండి! గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో మన స్థానం దేశానికే సిగ్గుచేటు. రవాండా కన్నా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాం మనం!

1995 తర్వాతి నుంచి ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలలో అవకతవకలు మనకు తెలిసినప్పటికీ ఇది ఆందోళన కలిగించే సంఖ్యే. 2001 నుంచి 2011 మధ్య, పదేండ్లలో ప్రతి గంటకు ఒకరి చొప్పున రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈరోజు పత్రికను చూస్తే, ఒక బీజేపీ ఎమ్మెల్యే రైతులకు ఆత్మహత్యలు ఫ్యాషన్‌ అయిపోయిందని అన్నాడు. ఇంకా చాలా మందే ఇలా అన్నారు! చంద్రబాబు నాయుడు కూడా నష్టపరిహారం కోసం రైతులు ఆత్మహత్యలకు పాల్పడతారని వ్యాఖ్యానించాడు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలలో లక్ష రూపాయల నష్టపరిహారం పొందింది కేవలం 12 శాతం మాత్రమే. ఆంధ్ర, మహారాష్ట్రలలోనే ఇది కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత పదేండ్లుగా మేమక్కడ గొడవ చేస్తున్నాం కాబట్టి.

అసలు నష్టపరిహారంగా ఇచ్చే లక్ష రూపాయలు ఎలా ఎటు పోతాయో తెలుసా మీకు? రూ. 30 వేలు మృతి చెందిన రైతు భార్యకు నగదుగా ఇస్తారు. 70 వేలు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తారు. ఇది మంచిదే. మేం కూడా ఇదే డిమాండ్‌ చేశాం. ఎందుకంటే ఆమె కలెక్టర్‌ ఆఫీసు నుంచి తిరిగి రాగానే కాచుకుని కూర్చునే వడ్డీ వ్యాపారులు వాటిని కాజేసే అవకాశం ఉంది. ఈ డిపాజిట్‌తో రైతు భార్యకు లభించేది నెలకు రూ. 446 మాత్రమే. ఈ సమస్యపై మేం తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. చనిపోయిన 3 లక్షల మందే కాదు, దాదాపు అదే స్థితిలో ఉన్న పదుల లక్షల మంది రైతుల గురించి ఆలోచించండి అని అడుగుతున్నాం.

ఈ సమస్య పట్ల ప్రభుత్వం, మీడియా, మేధావులతో పోలిస్తే సాధారణ ప్రజలే ఎక్కువ సానుభూతిని చూపుతున్నారన్నది మరో వాస్తవం. అయితే మేధావులలో కొందరు ఇందుకు మినహాయింపు. రైతుల పక్షం వహించిన అలాంటి మేధావుల్లో 90 శాతం మంది జేఎన్‌యూ వారే. దీని పట్ల మీరంతా గర్వించాలి. నేను కూడా తటపటాయిస్తున్న స్థితిలో, దీన్ని వ్యవసాయ సంక్షోభం అని అభివర్ణించడానికి తొలిసారిగా ధైర్యం చేసిన వారు జేఎన్‌యూకు చెందిన ప్రొఫెసర్‌ ఉత్సా పట్నాయక్‌. నిరుటి దాకా, సంవత్సరంలో 250 రోజులకు పైగా ఫీల్డు పర్యటనలు చేసే రిపోర్టరుగా ఉన్న నాకు మరే రకంగా కూడా ఈ సమస్య అర్థం కాకపోయేది. మీడియాలో కూడా కొంత మంది ఉన్నారు. జైదీప్‌ హార్డికర్‌, పురుషోత్తం ఠాకుర్‌, ప్రియాంక కాకోడ్కర్‌.. వంటి వారు బ్రహ్మాండమైన కథనాలు రాశారు.

ఈ సమస్యపై ఎన్నో కమిషన్లు వేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యలపై ఏర్పాటైన కమిషన్లు 30 కన్నా ఎక్కువున్నాయి. ఎందుకంటే, మన దేశంలో ప్రభుత్వాలకు కావాల్సిన నివేదిక వచ్చే దాకా ఎన్నంటే అన్ని కమిషన్లు వేసే వీలుంది కదా! ఇద్దరు వీసీలతో కూడా కమిషన్లు వేశారు. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన వీరేశ్‌. ఆయన రైతుల ఆత్మహత్యలకు ముఖ్య కారణం ఆల్కహాలిజం (మద్యపానం) అని ప్రకటించాడు. దీనిని మీడియాలో 90 శాతం వెంటనే సమర్థించింది. ఆత్మహత్యలకు ఏదో ఒక కారణమే ఉండదు. చాలా కారణాలు పని చేస్తాయి. కానీ ఆత్మహత్యలు అధికంగా ఉండడానికి కారణం తాగడమే అయితే, ప్రపంచంలో ఏ జర్నలిస్టు కూడా బతికుండే వాడు కాదు! మేధావుల్లో అయితే చాలా తక్కువ మందే బతికుండే వాళ్లు! మానవ హక్కుల కార్యకర్తలైతే అసలు మిగిలే వాళ్లు కాదు!

మరో నివేదికను చూద్దాం. మహారాష్ట్రకు చెందిన మరో వీసీకి దీనిపై అధ్యయనం చేయాలని చెప్పారు. అప్పటికి నేను విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ను బాగా ఇబ్బంది పెడుతున్న సమయంలో ఈయనతో కమిషన్‌ వేశారు. ఈ పెద్ద మనిషి ఒక్క రైతుతో కూడా మాట్లాడలేదు. ఒక్క రైతు ఇంట్లోనైనా అడుగు పెట్టలేదు. అసలు రైతుల ఆత్మహత్యల గురించి ఆయన చాలా తక్కువగా, ఒక్క పేరాగ్రాఫ్‌ మాత్రమే రాశాడు. నేను కృత్రిమ భయాలను సృష్టించానంటూ నాపై ఖండనలకే ఆయన ఎక్కువ భాగం కేటాయించాడు. మహారాష్ట్రలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. 1995 నుంచి ఇక్కడ 63 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎన్‌సీఆర్‌బీ లెక్కలు చెబుతున్నాయి. ‘ముంబయి మిర్రర్‌’లో నన్ను ప్రభుత్వ వ్యతిరేకిగా చిత్రిస్తూ పతాక శీర్షికతో ప్రచురించారు. అయితే నా దేశవ్యతిరేక భావాలు కేవలం మహారాష్ట్రకే పరిమితం సుమా! ‘సాయినాథ్‌ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాడ’నేది శీర్షిక. అయితే దీన్నెవరూ సీరియస్‌గా తీసుకోలేదనుకోండి. విలాస్‌రావ్‌ చాలా సంతోషించారు. రాసిన వ్యక్తికి కూడా ఆనందం కలిగింది. ఆయనకు పురస్కారం కూడా లభించింది! పూణే వర్సిటీ వీసీ పదవి నుంచి ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడిగా వెళ్లాడు. అందరికీ మంచి అవకాశాలే! ఇదీ దీనిపై జరిగిన అకాడమిక్‌ కృషి!

రైతు కుటుంబాల్లో అతి ఎక్కువ ఖర్చు వైద్యంపైనే జరుగుతున్నది. విద్యపై చేసే దానికన్నా రెట్టింపు ఖర్చు దీనిపై చేస్తున్నారు. బహుశా భారతదేశం ప్రపంచంలోనే వైద్యరంగంలో అత్యధికంగా ప్రయివేటీకరణ జరిగిన పెద్ద దేశంగా ఉంది. దేశంలో వైద్యంపై జరిగే ఖర్చులో 84 శాతం సాధారణ ప్రజల జేబుల్లోంచి ఖర్చు చేసేదే. ఏదో మేరకు మిగిలి ఉన్న ఆరోగ్య కేంద్రాలను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారు. తాజా ప్రయివేటీకరణ 4000 ఆంగన్‌వాడీలది. వేదాంతకు చెందిన ఫ్రంట్‌ కంపెనీ కైర్న్‌కు మేనేజ్‌మెంట్‌ అప్పగించారు. 0-6 ఏండ్ల వయస్సు పిల్లల ఆలనపాలన దేశ భవిష్యత్తు నిర్మాణంలోనే కీలకమైంది. కానీ దాన్ని లాభాలార్జించే కార్పొరేషన్‌కు అప్పగిస్తున్నారు. త్వరలో మరిన్ని ప్రైవేటుపరం చేయనున్నారు.

ఇప్పుడు రైతు బీమా పథకాన్ని ముందుకు తెచ్చారు. 1991-2011 మధ్య రైతుల రుణభారం రెట్టింపయ్యింది. ఎన్‌ఎస్‌ఎస్‌ చెప్పిన గణాంకాలు (నిజానికి నేను వీటినసలు ఆమోదించను) రుణభారం గల రైతులు 26 నుండి 46 శాతానికి పెరిగారని చెబుతున్నాయి. అంటే 53 శాతం రైతులకు అప్పులు లేవని చెప్పే లెక్క నిజానికి ఒక జోక్‌! ఏ గ్రామంలో మీరీ మాట చెప్పినా రైతులు నవ్వుతారు. నాబార్డ్‌ వెల్లడి చేసిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో 51.3 శాతం వ్యవసాయ రుణాలు ముంబయి, దాని పరిసర ప్రాంతాలకే చేరుతున్నాయి. ఇదేమీ లీక్‌ అయిన డాక్యుమెంట్‌ కాదు. ఇది నాబార్డ్‌ ప్రవేశపెట్టిన అధికార పత్రం. వ్యవసాయం కన్నా అగ్రి బిజినెస్‌ చాలా ముఖ్యమైందిగా మారింది ప్రభుత్వాలకు.

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆర్‌. రామకుమార్‌ సేకరించిన వివరాల ప్రకారం 53 శాతం వ్యవసాయ రుణాలు 3 మెట్రోలలోనే పంపిణీ చేశారు. 38 శాతం (55 శాతం గ్రామీణ ప్రాంతం ఉన్న రాష్ట్రంలో) వ్యవసాయ రుణాలు మాత్రమే గ్రామీణ బ్యాంకుల బ్రాంచీల ద్వారా పంపిణీ చేశారు. ఆ ప్రాంతాలలోనూ అవి ఎవరికి దక్కాయన్నది వేరే ప్రశ్న. రూ. 50 వేలకు తక్కువ రుణాలే ఇవ్వడం లేదని కూడా రామకుమార్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. రూ. 50 వేలకన్నా తక్కువ రుణాలు తీసుకునేదెవ్వరో మీరే చెప్పండి. చిన్న, సన్నకారు రైతులు! ఇప్పుడు వ్యవసాయ రుణాలు రూ. 10 నుంచి 25 కోట్లకు చేరుకున్నాయి. ఎంత మంది చిన్న రైతులు బ్యాంకులకు వెళ్లి 25 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటారో మనకు తెలిసిందే! ఇలాంటి వాళ్లు నాకు ఇద్దరు తెలుసు! ఒకరు ముకేశ్‌, మరొకరు అనిల్‌! గత రెండు దశాబ్దాలలో వ్యవసాయం కోసం కేటాయించిన నిధులను సగానికి, మూడో వంతుకు, నాలుగో వంతుకు కుదించారు. వాటిని కార్పొరేట్‌ ప్రపంచానికి మళ్లించారు.

సారాంశంగా చెప్పాలంటే, మనమిప్పుడు కార్పొరేట్‌ రాజ్యాన్ని బలోపేతం చేసే దిశగా సాగిపోతున్నాం. నేను మొదట చెప్పినట్టుగా, మనల్ని సామాజిక మత ఛాందసవాదుల, ఆర్థిక మార్కెట్‌ ఛాందసవాదుల కూటమి పాలిస్తోంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితమైన పరిదృశ్యం కాదు. మార్కెట్‌ ఛాందసవాదులకు వాటికన్‌ వంటి అమెరికా, ప్రపంచంలో రెండు పచ్చి మతతత్వ దేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌లపై పూర్తిగా ఆధారపడి ఉంది. వీటిపై ఆధారపడే అమెరికా విధానాలు రూపొందుతాయి. మార్కెట్‌, మత ఛాందసవాదుల కూటమి కేవలం ఈ దేశానికి పరిమితమైంది కాదు. ఇది కొత్తది కూడా కాదు. వారికి ఒకరికొకరు చాలా అవసరం. ఇందులో రెండో దానికి మిమ్మల్ని కొట్టాలంటే మొదటిది అవసరం!

ఇక మీడియాను గమనిస్తే 20-25 ఏండ్ల కిందటికి, ఇప్పటికి చాలా తేడా ఉంది. సూటిగా చెప్పాలంటే ఇప్పుడు కేవలం రెండు రకాల జర్నలిజం ఉంది. ఒకటి జర్నలిజం, రెండోది స్టెనోగ్రఫీ… కార్పొరేట్‌ స్టెనోగ్రఫీ! నేనిదివరకు తమిళనాడులో ఈ మాట అన్నప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడి అభ్యంతరం చెప్పాడు. ‘సర్‌, మీరు స్టెనోగ్రఫీని నిందించడం ఆపేస్తారా’ అని అడిగాడు. ఏమిటి నీ సమస్య అడిగితే ఆయన తానొక స్టెనోగ్రాఫర్‌నని చెప్పాడు. ‘మేం చాలా గొప్పవాళ్లం. నేను కోర్టు స్టెనోగ్రాఫర్‌గా పని చేశాను. మేం ప్రతి ఒక్కరి వెర్షన్‌ తీసుకునే వాళ్లం. సాక్షులు, ప్రాసిక్యూషన్‌, నిందితులు, నేరస్థులు.. ప్రతి ఒక్కరిదీ! కానీ మీరంటున్న వాళ్లు మాత్రం అధికారంలో ఉన్న వాళ్లు ఏది చెబితే అది మాత్రమే రాస్తారు’ అని ఆయన అన్నాడు. నిజమే, స్టెనోగ్రాఫర్స్‌ చాలా నిజాయితీగా, గౌరవంగా పని చేస్తారు. అప్పటి నుంచి నేను ‘కార్పొరేట్‌ స్టెనోగ్రఫీ’ అనే పదాన్ని వాడుతున్నాను.

ఇక మీడియా యాజమాన్యాలెవరనేది చూస్తే… ఈ రోజు అతి పెద్ద మీడియా యజమాని ముకేశ్‌ అంబానీనే. మీడియా సంస్థలు రోజురోజుకూ చాలా తక్కువ గుత్త సంస్థలుగా కుదించుకుపోతున్నాయి. గతంలో వార్తాపత్రికల గుత్తాధిపత్యం ఉండేది. చానెల్స్‌లో గుత్తాధిపత్యం ఉండేది. ఇప్పుడలా లేదు. పాత తరహా మీడియా గుత్తాధిపత్యం ఇక లేదు. మీడియా సంస్థలు భారీ కార్పొరేట్‌ గుత్త సంస్థలలో భాగం ఇప్పుడు. నెట్‌వర్క్‌18 అనేది చాలా పెద్ద గుత్త సంస్థనే కానీ అది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనే భారీ సంస్థలో ఒక చిన్న భాగం మాత్రమే. పెద్ద మార్పులు జరిగిపోయాయిప్పుడు. వీటిని గమనించండి. ఇప్పుడు ఫోర్త్‌ ఎస్టేట్‌, రియల్‌ ఎస్టేట్‌ల మధ్య తేడా చెప్పడం కష్టం!

ఈరోజు మీలాగే మరెన్నో క్యాంపస్‌లు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఎఫ్‌టీఐఐ 105 రోజులు పోరాడింది. ‘ధర్మరాజు’ను బైటికి పంపించడానికి అక్కడి విద్యార్థులు పోరాడారు. మీకు భారతంలో ధర్మరాజు అసలు కథ తెలుసా? అతను నిజాయితీపరుడు, సత్యవంతుడు కాబట్టి అతని రథం ఎప్పుడూ భూమికి ఆరు అంగుళాలు పైనే ఉండేదట! ఆయన ద్రోణాచార్యుడితో అశ్వత్థామ చనిపోయాడని అబద్ధం చెప్పిన తర్వాతే అది నేల మీదకు దిగింది. కానీ ఈ ‘ధర్మరాజు’ రథం మాత్రం భూమి మీది నుంచి పైకి లేవడమే లేదసలు. పైగా అది బురదలో కూరుకుపోయింది!

రోహిత్‌ వేముల విషయం చూద్దాం. జనాభా లెక్కల వివరాల్లో మీకు నేనొక విషయం చెప్పలేదు. 40 కోట్ల మంది భారతీయులు అసలు పాఠశాల ముఖమే చూడలేదు. అంటే దేశంలో మూడో వంతు జనాభా! గ్రామీణ భారతంలో కేవలం 3 శాతం కుటుంబాల్లోనే ఒక గ్రాడ్యుయేట్‌ ఉన్నారు. ఎస్‌సీ, ఎస్టీలలో ఈ శాతం ఇంకా తక్కువగా ఉంది. ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాడు రోహిత్‌ వేముల! ఆయన పీహెచ్‌డీలో చేరాడు. బహుశా విద్యార్హతలేమిటో మనం ఎన్నటికీ తెలుసుకోలేని ఒక మంత్రికి వ్యతిరేకంగా అతను నిలబడ్డాడు! ఆమె కాలేజీ స్థాయినైతే దాటలేదని చెప్పొచ్చు. ఆమె చెబుతున్నట్టుగా సంస్కృతాన్ని ప్రచారం చేయడానికైతే నా దగ్గరో ఫార్ములా ఉంది! ఇరానీ చేసిన సీరియల్స్‌ అన్నీ సంస్కృతంలోకి డబ్‌ చేసి ఆ భాషలో మాత్రమే చూపించాలి. ప్రమోట్‌ చేసేందుకు ఇది మంచి పద్ధతి! నా స్నేహితుడు, కొలీగ్‌ సిద్ధార్థ్‌ వరదరాజన్‌ను అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో ఘెరావ్‌ చేయడం, వేధించడం, రెండేండ్ల క్రితం విక్రమాదిత్య యూనివర్సిటీ వీసీని కొట్టడం, దానితో అతను తర్వాత చనిపోవడం.. ఇవన్నీ మీరు ఒంటరిగా లేరని చాటిచెప్పే పరిణామాలే! ఇదే వాళ్ల అసలు స్వరూపం! జాతిపితను హత్య చేసిన వ్యక్తి పట్ల సోదరభావం గల వాళ్లు మిమ్మల్ని జాతివ్యతిరేకులని అంటున్నారు! తమను జైళ్లలోంచి విడుదల చేస్తే బుద్ధిగా ఉంటామని హామీ ఇచ్చి మరీ బ్రిటిష్‌ వాళ్లను దేబిరించిన నాయకుల వారసులు మీకు జాతీయవాదులుగా ఉండాలని లెక్చర్లు ఇస్తున్నారు! నిజానికి సామాజిక మత ఛాందసవాదులు ఒక వైపు, మార్కెట్‌ ఛాందసవాదులు మరోవైపు కాదు, వాళ్లు ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకొని ఊరేగుతున్నారు.

చివరగా, నిన్న జరిగిన ర్యాలీలో మీరు గొప్పగా వ్యవహరించారు. జేఎన్‌యూ ఎప్పుడూ వైవిధ్యంతో, బహుళ గొంతుకలకు వేదికగా ఉంది. అలాగే ఉండాలి కూడా. వేర్వేరు భావజాలాలు గల మీరంతా మీ విభేదాలను పక్కనబెట్టి, ఐక్య సంఘటనగా ఏర్పడి ఈ దుష్ట రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈ ఐక్యతను పోగొట్టుకోకండి. మీ విభేదాలు ఉండనీయండి. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలపై నిలబడే హక్కుంది. అయితే సామాజిక మత ఛాందసవాదానికి, మార్కెట్‌ ఛాందసవాదానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని మాత్రం ఆపకండి. మీ ఐక్యతను దెబ్బతీసే అవకాశం వాళ్లకు ఏ మాత్రం ఇవ్వకండి. నేను మీ అందరి పట్ల గర్విస్తున్నాను!

-అనువాదం: జి.వి.కె. ప్రసాద్‌
(నవతెలంగాణ సౌజన్యంతో)