ఆ సినిమాలో అమితాబ్ లేడు

దాదాపు కొన్ని నెలలుగా నలుగుతున్న ప్రచారానికి దర్శకుడు శంకర్ ఫుల్ స్టాప్ పెట్టాడు. రజనీకాంత్ తో ప్రస్తుతం తను తెరకెక్కిస్తున్న రోబో 2.0 సినిమాలో అమితాబ్ బచ్చన్ లేడని తేల్చిచెప్పాడు శంకర్. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో బిగ్ బి కనిపిస్తాడనే ప్రచారం జరుగుతూ వచ్చింది. నిజానికి బిగ్ బిను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని శంకర్, రజనీకాంత్ కూడా అనుకున్నారు. కానీ రోబో 2.0లో నటించడానికి అమితాబ్ ఎందుకో ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దీంతో తమ సినిమాలో బిగ్ బి నటించడం లేదని డైరక్టర్ శంకర్ అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం రోబో 2.0 సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. జురాసిక్ పార్క్, ఐరన్ మ్యాన్, ఎవెంజర్స్ లాంటి సినిమాలకు పనిచేసిన గ్రాఫిక్స్ టీం… రోబో 2.0కు వర్క్ చేస్తోంది.