బ్ర‌స్సెల్స్ బీభ‌త్సానికి ముఖ‌చిత్రంగా… ముంబ‌యి మ‌హిళ‌!

అనుకోని దుర్ఘ‌ట‌న‌లు, వైపరీత్యాలు సంభ‌వించిన‌పుడు ఆయా ఘోరాల‌కు కొన్నిఫొటోలు అద్దం ప‌డుతుంటాయి. కాల‌క్ర‌మంలో ఆ దుర్ఘ‌ట‌న‌ని త‌ల‌చుకున్న‌పుడు మ‌న‌కు ఆ ఫొటోలే ముందు గుర్తొస్తుంటాయి. దుర్ఘ‌ట‌న‌లోని తీవ్ర‌త‌ని య‌ధాత‌థంగా ప‌ట్టి ఇచ్చే అలాంటి ఫొటోలు కాలం గ‌డిచినా క‌నుమ‌రుగు కావు. బీభ‌త్స శిధిలాల మ‌ధ్య…కాలంతో పాటు శిధిలం కాని చిత్రాలుగా వాటిని చెప్ప‌వ‌చ్చు. నాటి భోపాల్ దుర్ఘ‌ట‌న ఫొటో నుండి నిన్న‌మొన్న‌టి మూడేళ్ల సిరియా బాలుడు ఐలాన్ కుర్దీ, ట‌ర్కీ బీచ్‌లో బొక్క‌బోర్లా ప‌డిఉన్న‌చిత్రం వ‌ర‌కు… అలాంటి ఫొటోలెన్నో మ‌న జ్ఞాప‌కాల్లో ఎప్ప‌టికీ శిధిలం కాకుండా మిగిలే ఉంటాయి. ఇప్పుడు అలాగే బ్ర‌స్సెల్స్ పేలుళ్ల ఘ‌ట‌న‌లోని విషాదం, బీభ‌త్సాల‌ను క‌ళ్ల‌కు క‌డుతున్న ఫొటోగా బ‌య‌ట‌కు వ‌చ్చిన దాంట్లో ఓ ముంబయి మ‌హిళ ప్ర‌ముఖంగా క‌న‌బ‌డుతున్నారు. ఈ వార్త‌ని ప్ర‌చురించిన ప‌లు వార్తా పేప‌ర్ల‌లో ఆమె ఫొటో క‌నిపించ‌డంతో ఈ దుర్ఘ‌ట‌న‌ మిగిల్చిన జ్ఞాప‌కాల ప్ర‌తిరూపంగా ఇక‌పై ఆమె మార‌నున్నారు.

బ‌ట్ట‌లు చిరిగిపోయి నుదుటి నుండి ర‌క్తం కారుతున్న నిధి చాపెకార్, బ్ర‌స్సెల్స్ ఎయిర్‌పోర్టులో అలాగే ఘ‌నీభ‌వించిన‌ట్టుగా కూర్చుని ఈ ఫొటోల్లో క‌న‌బ‌డుతోంది. ముంబ‌యికి చెందిన ఈ మ‌హిళ‌ జెట్ ఎయిర్‌వేస్‌లో ఇన్‌ఫ్లైట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. బ్ర‌స్సెల్స్ ప్ర‌మాదం త‌రువాత సోష‌ల్ మీడియాలో ఆ ప్ర‌మాద వార్త‌తో పాటు నిధి ఫొటో, వార్త తాలూకూ చిత్రంగా  విస్తృతంగా క‌నిపించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెబ్‌సైట్ల‌తో పాటు, అమెరికా న్యూయార్క్ టైమ్స్‌, ది గార్డెన్ (యుకె), భార‌త్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా నుండి మ‌ల‌యాళ మ‌నోర‌మ వ‌ర‌కు నిధి ఫొటోనే ప్ర‌చురించాయి. అంథేరి నివాసి అయిన ఆమె గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్ర‌చురించాక‌, అదే స్టోరీని ఆధారం చేసుకుని నిధి గురించిన క‌థ‌నాలు టైమ్స్ మేగ‌జైన్‌, యుఎస్ఎ టుడె, ది డైలీ మెయిల్ త‌దిత‌ర ప‌త్రిక‌ల్లో వ‌చ్చాయి. నిధి ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో కోలుకుంటోంది.

అత్యంత భ‌యాన‌క‌మైన ఒక సంద‌ర్భానికి ఆమె ఫొటో ఒక ప్ర‌తీక‌గా మారింద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. కేట్వాన్ క‌ర్‌దావా అనే 36 ఏళ్ల‌మ‌హిళా పొటోగ్రాఫ‌ర్, అసోసియేటెడ్ ప్రెస్ కోసం ఈ ఫొటోని తీసింది. పేలుడు జ‌ర‌గ‌గానే త‌న మొద‌టి స్పంద‌న కెమెరా బ‌య‌ట‌కు తీయ‌డ‌మేన‌ని ఆమె తెలిపింది. నిధి ఫొటోనే ఆమె తొలిగా తీసింది. ముందు తాను కంగారుగా  డాక్ట‌ర్‌, డాక్ట‌ర్ అంటూ అరిచాన‌ని, త‌రువాత ప‌రిస్థితి అర్థ‌మై కెమెరా తీసి ఎల్లో జాకెట్‌లో ఉన్న మ‌హిళ‌ను ఫొటో తీశాన‌ని ఆమె తెలిపింది. ఆ స‌మయ‌లో తాను ఒక జ‌ర్న‌లిస్టుగానే స్పందించాన‌ని, అక్క‌డ  ఏం జ‌రిగిందో ప్ర‌పంచానికి చూపాల్సిన బాధ్య‌త త‌నకుంది క‌నుక ఫొటోలు తీశాన‌ని కేట్వాన్ తెలిపింది.