తెలుగు సినిమాకి కొత్త ‘ఊపిరి’

రేటింగ్‌ : 3.75/5
తారాగణం: నాగార్జున, కార్తీ, తమన్నా
సంగీతం: గోపీ సుందర్
దర్శకత్వం: వంశీ పైడిపల్లి
నిర్మాత: ప్రసాద్ వి పొట్లూరి
విడుదల తేదీ: మార్చి 25, 2016

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అతన్ని శాసించేది భావోద్వేగాలే. డబ్బు ప్రాముఖ్యత పెరిగి, విలువలు ఎంత పతనమైనా బంధాలు, అనుబంధాలు ఇంకా మిగిలేవున్నాయి. ఏమీ ఆశించకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తూనే వుంటారు. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ళు, ప్రాణస్నేహితులు వీళ్ళెవరు లేకపోతే ప్రపంచం పువ్వులు లేని ఎడారిలా వుంటుంది.

ఎమోషన్స్ అంచులవరకూ తీసుకెళ్ళి తెలుగుసినిమాకి కొత్త రూపాన్నిచ్చింది ఊపిరి. కళ్ళతోనే భావాలు పలికించిన నాగార్జున, సీరియస్‌ సినిమాలో కూడా అద్భుతమైన హాస్యాన్ని పండించిన కార్తీకి ఈ క్రెడిట్‌ దక్కుతుంది. టోటల్‌ క్రెడిట్‌ ఈ భారాన్ని మోసిన వంశీ పైడిపల్లిదే.

వెనుకటికి చంద్రహారం సినిమాలో హీరో ఎన్టీయార్‌ సగం సినిమా నిద్రలోనే వుంటాడు. అది శాపం. దాంతో ప్రేక్షకులు కూడా నిద్రపోయారు. చంద్రలేఖ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇలాగే మాటపలుకూ లేకుండా వుంటుంది. ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు. హిందీలో సంజయ్‌ లీలా బన్సాలీ తీసిన గుజారిష్ లో కూడా హృతిక్‌రోషన్‌ది ఇదేస్థితి. పైగా అతను స్వచ్ఛంద మరణం కోసం కోర్టుని ఆశ్రయిస్తాడు. ఇది కూడా జనానికి ఎక్కలేదు.
అయితే ఊపిరి సినిమాలో నాగార్జున జీవించాలనుకుంటాడు. నలుగురికి జీవితాన్ని పంచాలనుకుంటాడు. ఈ పాజిటివ్‌నెస్‌ సినిమా మొత్తాన్ని గట్టెక్కించింది. లేకపోతే నాగార్జున కుర్చీలో నుంచి లేవడు అనే విషయం ప్రేక్షకుణ్ణి భయానికి గురిచేసేది.

ఫ్రెంచి సినిమా ఇన్‌టచబుల్స్‌లో ఏం తీసారో తెలియదుకానీ, దాని ఆధారంగా తీసిన ఊపిరి ఒక క్లాసిక్‌. అయితే ఇంత బాగా తీసిన సినిమాలో మన తెలుగు బుద్దిపోనిచ్చుకోకుండా అనవసరంగా రెండుపాటలున్నాయి. అక్కడక్కడ నత్తనడక నడిపించినా దర్శకుణ్ణి క్షమించొచ్చు.

కథ గురించి చెప్పాలంటే ఒక ప్రమాదంలో గాయపడిన నాగార్జున కాళ్లూ చేతులు పనిచేయని స్థితిలో  కుర్చీకి అతుక్కుపోతాడు. అతనికి అటెండెంట్‌గా కార్తి ఉద్యోగంలో చేరుతాడు. అప్పటికే అతడు దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఉంటాడు. అతని నిర్లక్ష్యం, ముక్కుసూటితనం నాగార్జునకి నచ్చుతాయి. నాగార్జున సెక్రెటరి తమన్నా, ఆమె అందాన్ని చూసి కార్తీ ఆ ఉద్యోగంలో చేరుతాడు. నాగార్జున, కార్తీలకి మధ్య అనుబంధమే ఈ సినిమా. ఒకరినొకరు ఏమీకాని ఇద్దరు, ఒకరికోసం మరొకరు ఏంచేశారో చూడాల్సిందే..

బ్రహ్మానందం చెంపదెబ్బల హాస్యాన్ని చూసిచూసి విసిగెత్తిన ప్రేక్షకులకు, ఈ సినిమాలోని సున్నితమైన హాస్యం పెద్ద రిలీఫ్. హాస్యనటుల అవసరం లేకుండా కార్తీనే హాస్యం పండించారు. అబ్బూరి రవి మాటలు చాలాచోట్ల కంటతడి పెట్టిస్తాయి. ఫోటో గ్రఫి ఎక్స్‌ లెంట్. పాటలు పెద్దగా నచ్చవు కానీ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సూపర్.

నాగార్జున కేరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ మూవీస్ ఇది. మనిషి కదలకుండా నటించడమే అద్భుతం. నాగార్జునతో కార్తీ పోటీపడి నటించాడు. తమన్నా తన పాత్రలో ఇమిడిపోయింది.  కార్తీ తల్లిగా జయసుధ జీవించింది. అమ్మగా ఆమె తరువాతే ఎవరైనా. ప్రకాశ్‌రాజ్‌, అలీ కథని ముందుకి నడిపించారు.

రెండు పాటలు, నలుగు ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకెండాఫ్‌లో విలన్‌ని ఫూల్ చేయడం ఈ ఫార్ములాకి పూర్తిగా భిన్నమైన సినిమా ఇది. ఇలాంటివి ఎంత ఎక్కువ వస్తే అంతగా ప్రేక్షకులకి, సినిమా పరిశ్రమకి ఆరోగ్యకరం.

పారిస్‌ అందాలతో పాటు అనుష్క, శ్రేయ కూడా సినిమాకి ఫ్లస్ పాయింట్స్. జీవితం మనల్ని ఎంత కష్టపెట్టినా నవ్వుతూ జీవించాలి. జీవితం ఒక వరం, కదలలేని స్థితిలో కూడా కదులుతున్న ప్రపంచాన్ని  ప్రేమించాలి. ఈ సూత్రాన్ని అంతర్లీనంగా ఒక ఫిలాసఫీలా, తాత్విక బోధనలా చెప్పిన వంశీ పైడిపల్లికి హాట్పాఫ్. ఈ సినిమా చూస్తే మరింతగా మనం జీవితాన్ని ప్రేమిస్తాం.

-జీఆర్‌. మహర్షి